మోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం అమెరికాలో పర్యటించనున్నారు. ఆ సమయంలో మోదీని కలుస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. యూఎస్ అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న ట్రంప్..మిషిగాన్‌లో జరిగిన ప్రచారంలో మోదీపై ప్రశంసలు కురిపించారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. వాణిజ్యపరంగా భారత్ వైఖరి బాగోలేదని విమర్శిస్తూనే ఈ కామెంట్స్ చేశారు ట్రంప్. సెప్టెంబర్ 21 నుంచి 23 వరకూ ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తారు. అక్కడ క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొంటారు. ఆ తరవాత యునెైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రసగించనున్నారు. న్యూయార్క్‌లో భారతీయులను ఉద్దేశిస్తూ స్పీచ్ ఇవ్వనున్నారు. అమెరికాకి చెందిన బడా సంస్థల సీఈవోలతోనూ భేటీ అవనున్నారు. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక బంధం బలోపేతం చేసేందుకు కీలక చర్చలు జరపనున్నారు. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం మోదీ ప్రచారం చేశారు. ఈ బహిరంగ సభకి భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అయితే...ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు. జో బైడెన్ విజయం సాధించారు.