Joe Root Breaks run Record with 150 | మోడ్రన్ డే టెస్టు మాంత్రికుడిగా ఎదిగిన జో రూట్ | ABP Desam
ఎవ్వరూ పెద్దగా సీరియస్ గా తీసుకుని ఉండరు. జో రూట్ ఇంతటి విధ్వంసకారుడిగా మారతాడని. ఎవ్వరూ కనీసం అనుకుని ఉండరు. లెజెండ్స్ అనిపించుకున్న ఎంతో మంది ప్లేయర్లను నిమిషాల వ్యవధిలో దాటుకుంటూ పోతాడని. కానీ అవన్నీ చేసి చూపించాడు ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్. భారత్ తో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 150పరుగులు చేసి రూట్..ఒక్క టెస్టులో ముగ్గురు లెజెండ్స్ చేసిన పరుగుల రికార్డులను బ్రేక్ చేసి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వెనుకాలే నిలబడ్డాడు. ఎస్ నిన్న రూట్ భారత్ పై చేసిన 150 పరుగులుతో ఇన్నాళ్లు అత్యధిక పరుగుల జాబితాలో సచిన్ తర్వాత పాంటింగ్, కలిస్, ద్రవిడ్ ల పరుగుల రికార్డులు బద్ధలయ్యాయ్. నిన్న 150తో మొత్తం కెరీర్ లో 13వేల 409పరుగులు చేసిన రూట్...ఈ క్రమంలో 13వేల 288 పరుగులు చేసిన ద్రవిడ్ ను, 13వేల 289 పరుగులు చేసిన జాక్ కలిస్ ను, 13వేల 378పరుగులు చేసి రికీపాంటింగ్ ను దాటి సచిన్ తర్వాత టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలబడ్డాడు. ఇక జో రూట్ కంటే ముందు మిగిలింది సచిన్ మాత్రమే. టెండూల్కర్ 200 టెస్టుల్లో 15వేల 921పరుగులు చేస్తే...జో రూట్ 157 టెస్టులు ఆడి రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం 34ఏళ్ల వయస్సున్న రూట్ మరో రెండు మూడు ఏళ్లు టెస్ట్ క్రికెట్ ఆడి 20-30 టెస్టులు పూర్తి చేయగలిగితే..క్రికెట్ దేవుడి అత్యధిక టెస్టు పరుగుల రికార్డు కూడా బద్ధలు కావటం ఖాయంగా కనిపిస్తోంది.





















