Chandrababu House: చంద్రబాబు ఇంటి వద్ద హైటెన్షన్... టీడీపీ, వైసీపీ కార్యకర్తల రాళ్లదాడి
గుంటూరు జిల్లా ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు ఇంటిని ముట్టడించేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించాయి. దీంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ మధ్య వాగ్వాదం జరిగింది. అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ పై చేసిన కామెంట్స్ పై జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న క్షమాపణ చెప్పాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. ఇరువర్గాలకు సర్ధిచెప్పేందుకు పోలీసులు పరిశీలిస్తున్నారు. టీడీపీ, వైసీపీ నేతలు కర్రలతో దాడులు చేసుకున్నారు. చంద్రబాబు పిరికిపందలా దాక్కొన్నారని జోగి రమేష్ ఆరోపించారు. చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమేస్తామని ఆయన అన్నారు. చంద్రబాబు ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది.





















