Gajendra Shekawat: అన్నమయ్య డ్యాంగేటు తెరుచుకోలేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా.?
కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ ఏపీ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్ర జల శక్త్ మంత్రి... "అన్నమయ్య డ్యాంకు ఒకేసారి దాని స్పిల్‌వే సామర్థ్యానికి ఒకటిన్నర రెట్లు అధికంగా నీళ్లు వచ్చాయి. అందుకే స్పిల్‌వే విరిగిపోయింది. స్పిల్‌వే, గేట్లు తెరిచి నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నించారు. కానీ ఒక గేటు తెరుచుకోలేదు. దానికి బాధ్యులు ఎవరు? రాష్ట్రానికి దాని బాధ్యత లేదా? ఈ డ్యాం గురించి అంతర్జాతీయంగా అధ్యయనం మొదలుపెడితే అది మనకు సిగ్గుచేటు. డ్యాం తెగిపోవడానికి సభలో కూర్చున్న సభ్యులంతా బాధ్యత వహించాల్సిందే. డ్యాం సేఫ్టీ బిల్లు ద్వారా ఏర్పాటు చేస్తున్న జాతీయ డ్యాం సురక్ష ప్రాధికార సంస్థకు జరిమానాలు వేసే అధికారం ఉంటుంది. డ్యాం రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం (డ్రిప్)లో ఆంధ్రప్రదేశ్ డ్యాంలను డ్రిప్‌లో చేర్చలేదని విజయసాయిరెడ్డి అన్నారు. అయితే కొలమానాలను ఆంధ్రప్రదేశ్ చేరుకోలేదు. చేరుకుంటే మీరు సూచించిన డ్యాంలనూ ఇందులో చేరుస్తామని సభాముఖంగా చెబుతున్నా’ అని పేర్కొన్నారు.