Minister Nadendla Manohar: సీజ్ ది షిప్, స్టెల్లా షిప్పులో మరోసారి తనిఖీలు - బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్న మంత్రి నాదెండ్ల
Nadendla Manohar: బియ్యం అక్రమ రవాణాలో అధికారులు కీలక చర్యలు తీసుకుంటున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టెల్లా షిప్పును మరోసారి తనిఖీ చేస్తున్నారు.
Minister Nadendla Manohar Key Comments Kakinada Port Ship: రాష్ట్రవ్యాప్తంగా సంచనలం సృష్టించిన సీజ్ ది షిప్ వ్యవహారంపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు అధికారులు కాకినాడ పోర్టులో తనిఖీలు ముమ్మరం చేశారు. పోర్టులో మరోసారి స్టెల్లా షిప్‌లో తనిఖీలు చేపట్టారు. పోర్ట్ కస్టమ్స్, పౌర సరఫరాల శాఖ, పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు ఈ తనిఖీల్లో పాలు పంచుకున్నారు. తనిఖీలు జరిగినప్పుడు అక్రమ పద్ధతుల్లో రవాణా జరిగే వస్తు సామాగ్రిని గుర్తించడంలో ఒక్కో శాఖకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఈసారి వివిధ శాఖల అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో ఏం బయటపడుతుందోననే సస్పెన్స్ నెలకొంది.
ఇప్పటికే ఈ నౌకలో భారీ మొత్తంలో రేషన్ బియ్యం ఉన్నట్లు గతంలో జరిగిన తనిఖీల్లో తేలిన సంగతి తెలిసిందే. అందుకే షిప్‌ను సీజ్ చేయండంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. పవన్ కళ్యాణ్ ఈ తనిఖీల్లో కీలకంగా వ్యవహరించారు. పోర్టులో అధికారులతో నిలబడి ఆయన చెప్పిన మాటలు రాష్ట్రవ్యాప్తంగా వైరలైన సంగతి తెలిసిందే.
అక్రమ రవాణపై ఉక్కుపాదం..
బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటివరకు కోటి ఇరవై టన్నుల బియ్యం అక్రమ రవాణా జరిగినట్లు తమకు సమచారం ఉందని పేర్కొన్నారు. ఇక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్న తమ ప్రభుత్వం.. ఇప్పటివరకు 1,066 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. పారదర్శకమైన విధానాల కోసం ప్రభుత్వంతో కలిసి రైసుమిల్లర్ల అసోసియేషన్ పని చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. తాజాగా విశాఖ కలెక్టరేట్‌లో రీజనల్ సివిల్ సప్లైస్ శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు.
24 గంటల్లోనే రైతుల ఖాతాకు జమ..
రైతుల విషయంలో తమ ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే వారి ఖాతాలకు డబ్బు జమ చేస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రక్రియను త్వరితగతిన జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇక ఉత్తరాంధ్రలో ధాన్యం కొనుగోలును ముమ్మరం చేస్తున్నామని తెలిపారు. 1.69 లక్షల టన్నుల ధాన్యాన్ని ఒక్క ఉత్తరాంధ్రలోనే కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. బియ్యం అక్రమ రవాణాలో కాకినాడ పోర్టు కీలకంగా పనిచేసిందని వెల్లడించారు.
రెండింతల అక్రమ రవాణా కాకినాడ నుంచే..
విశాఖ, క్రిష్ణపట్నం పోర్టుల కంటే కూడా కాకినాడ పోర్టు నుంచే బియ్యం రవాణా రెండింతలు జరిగిందని మంత్రి నాదెండ్ల తెలిపారు. పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణాలో కొంతమంది ప్రభుత్వ అధికారుల పాత్ర ఉందని నిర్దారించారు. ఈ అక్రమాల్లో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని పేర్కొన్నారు. ఇక విశాఖ పోర్టుపైనా దృష్టి పెడతామని పేర్కొన్నారు. కాకినాడ కలెక్టర్ ఆధ్వర్యంలో స్టెల్లా షిప్‌లో అణువణువూ తనిఖీ జరుగుతోందని తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఇప్పటికే సీబీ సీఐడీ విచారణకు ఆదేశించామని గుర్తు చేశారు. ఇప్పటివరకు 729 మందిని, 102 వాహనాలను సీజ్ చేశామని వెల్లడించారు. బియ్యం అక్రమ రవాణాకు పాల్పడిన అక్రమార్కులపై పీడీ యాక్టును నమోదు చేస్తామని హెచ్చరించారు.
Also Read: Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?