Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Microsoft: ఏపీ రాజధాని అమరావతి దగ్గరలో మైక్రోసాఫ్ట్ భూమిని కొనుగోలు చేసింది.దీంతో ఏపీలో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టబోతోందన్న ప్రచారం జరుగుతోంది.
Microsoft India buys 25-acre land parcel near Amaravati : ప్రపంచ దిగ్గజ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దగ్గరలో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లుగా ప్రాప్‌స్టాక్ తెలిపింది. ప్రభుత్వంతో సంబంధం లేకుండా మైక్రోసాఫ్ట్ సంస్థ నందిగామ వద్ద పాతిక ఎకరాల భూమిని రూ. 181 కోట్లుపెట్టి కొనుగోలు చేసినట్లుగా జాతీయ మీడియా చెబుతోంది. నందిగామ అమరావతి నుంచి అరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ నాట్కో ఫార్మా, టైమ్ క్యాప్ ఫార్మా అనే కంపెనీలకు భూమి ఉంది. వారి వద్ద నుంచి మైక్రోసాఫ్ట్ భూమి కొనుగోలు చేసినట్లుగా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఆదారంగా పాప్ స్టాక్ తెలిపింది.
నందిగామ వద్ద గత సెప్టెంబర్‌లోనే భూమి కొన్న మైక్రోసాఫ్ట్ ఇండియా
మైక్రోసాఫ్ట్ సంస్థ ఇప్పటి వరకూ ఏపీలో పెట్టుబడులపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కనీసం ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. మైక్రోసాఫ్ట్ సంస్థ అడిగితే ప్రభుత్వమే అమరావతి లేదా విశాఖపట్నంలో భూమి ఇస్తుంది.. తమ ఆఫీసును ఏర్పాటు చేయడానికి రాయితీలు కూడా ఇస్తుంది. కానీ గత సెప్టెంబర్‌లోనే మైక్రోసాఫ్ట్ సైలెంట్ గా భూమి కొనుగోలు చేసిందన్న విషయం బయటకు వచ్చిది. ఆ స్థలం కొనుగోలు చేయడంలో మైక్రోసాఫ్ట్ వ్యూహం ఏమిటో ఇంకా స్పష్టత లేదు. అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆ స్థలంలో మైక్రోసాఫ్ట్ ఎలాంటి ఆఫీసులు పెట్టాలనుకుంటోందో కూడా ఎవరికీ తెలియదు.
Also Read: ఏపీ యువతకు గూగుల్ నైపుణ్య శిక్షణ - నారా లోకేష్ సమక్షంలో ఒప్పందం
విపరీతంగా పలు చోట్ల భూముల్ని కొంటున్న మైక్రో సాఫ్ట్
అయితే మైక్రో సాఫ్ట్ వ్యూహాత్మకంగా డిమాండ్ పెరుగుతుందని అనుకున్న చోట్ల భూముల్ని కొనుగోలు చేస్తోందని ప్రాప్ స్టాక్ చెబుతోంది. గత రెండేళ్లుగా పలు చోట్ల భూములు కొనుగోలు చేసింది. పుణె లో వెయ్యి కోట్లు పెట్టి 30 ఎకరాలను గత ఏడాది కొనుగోలు చేసింది. గత ఆగస్టులో మరో పదహారు ఎకరాలను రూ. 453 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లుగా స్క్వేర్ యార్డ్స్ సంస్థ తెలిపింది. 2022లో పుణెలో రూ. 328కోట్ల విలువైన కమర్షియల్ ప్లాట్ ను కూడా కొనుగోలు చేసింది.
క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికేనా ?
పుణె తర్వాత అమరావతికి సమీపంలోనే మైక్రోసాఫ్ట్ భూమిని కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారింది. భూములపై పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్‌లో తమ కార్యకలాపాల విస్తరణకు అవసరమైన ల్యాండ్ బ్యాంక్ ను సమకూర్చుకుంటుందా లేకపోతే.. ఇంకేదైనా వ్యూహం ఉందా అన్నదానిపై ఇండస్ట్రీ వర్గాలకు ఎలాంటి సమాచారం లేదు. తమ భూముల కొనుగోళ్ల వ్యవహారాలపై మైక్రోసాఫ్ట్ ఇండియా కూడా ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు.