Telangana Elections 2023 : బీఆర్ఎస్‌లో చేరిన వైఎస్ఆర్‌టీపీ నేతలు - విలీనం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పిన హరీష్ రావు
YSRTP Leaders Join In BRS : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేతలు బీఆర్ఎస్‌లో చేరిపోయారు. విలీనం చేసినందుకు హరీష్ రావు అభినందనలు తెలిపారు.
Telangana Elections 2023 YSRTP Leaders Join In BRS : వైఎస్ఆర్‌టీపీ బీఆర్ఎస్‌లో విలీనం అయినట్లుగా మంత్రి హరీష్ రావు ( Harish Rao ) వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన గట్టు రాంచందర్ రావు అధ్వర్యంలో ముఖ్య నాయకులు, అన్ని జిల్లా కోఆర్డినేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి హరీష్ రావు గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. వైయస్ఆర్టీపీని బిఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు స్వాగతమన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ వాళ్లు పార్టీ పెట్టగలుగుతారా పార్టీ నడపగలుగుతారా తెలంగాణ వాళ్లకు అంత సీను ఉందా అనే అవహేళన మాటలు ఎన్నో విన్నామమని.. ఇలాంటి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని 14 సంవత్సరాలు పార్టీని నిలబెట్టి, రాష్ట్ర సాధన కోసం చావు అంచుల వరకు వెళ్లి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ ( KCR ) అని హరీష్ రావు గుర్తు చేసారు.
సమైక్య నాయకులు పార్టీ పెట్టడమంటే పాన్ డబ్బా పెట్టడం కాదు అని అవహేళన చేశారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ చీకటి మయమైతుందని చెప్పారు. ఆయనలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పే లాగా ఈరోజు రాష్ట్రాన్ని సాధించి దేశానికి ఆదర్శంగా కేసీఆర్ నిలిపారన్నరు. తండ్రి సమానులైన కేసీఆర్ ని రాజకీయం కోసం నానా మాటలు తిట్టి ఈ రోజు రాజకీయాల కోసం పార్టీని గాలికి వదిలేసిన నాయకురాలు షర్మిల అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేస్తామని చెప్తున్న కర్ణాటక మోడల్ ప్రజలకు అర్థమైందన్నారు. కర్ణాటకలో రైతులు రోడ్డు మీదకు వచ్చారు. మూడు గంటల కరెంటు ఇచ్చి రైతుల ఉసురు పోసుకుంటుంది కాంగ్రెస్ అని మండిపడ్డారు.
ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ మోడల్ తెలంగాణలో పనికి రాదని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తోక ముడ్చుకుందన్నారు. రైతులకు ఇస్తున్న రైతుబంధు దండగ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని .. తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల నినాదాన్ని కూడా అవహేళన చేసే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ అమరవీరులను అవహేళన చేసి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కించపరచేలా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీమాంధ్ర నాయకుల సూట్ కేసులు మోయడానికి అలవాటు పడ్డ వెన్నెముక లేని నాయకులు తెలంగాణని సమైక్య పాలకుల పాదాల దగ్గర పెడతారని ఆరోపించారు.
ఈరోజు కాంగ్రెస్ పాలిస్తున కర్ణాటక రాష్ట్రానికి బియ్యం కావాలని తెలంగాణ రాష్ట్రాన్ని అడుగుతున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చుని.. తెలంగాణలో కాంగ్రెస్ చేసింది ఏం లేదన్నారు. ఈరోజు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణను కేసీఆర్ మార్చారన్నారు. కాంగ్రెస్ పార్టీకి 50 పైన స్థానాల్లో అభ్యర్థులు లేని పరిస్థితి ఉందన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్ అని ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయం గురించి తెలవని రేవంత్ రెడ్డికి ఎంత హార్స్ పవర్ మోటర్ రైతులు ఉపయోగిస్తారో కూడా తెలియదన్నారు. 10 HP మోటర్ పెట్టి మూడు గంటలు కరెంట్ ఇస్తే చాలు అని చెప్పే అవగాహన లేని అధ్యక్షుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి రైతులకు ఏం చెప్పాలని అనుకుంటున్నారన్నారు. YSRTP లో ఎదుర్కొన్న సూటిపోటి మాటలు అవహేళనలు బీఆర్ఎస్ పార్టీలో ఉండవని భరోసా ఇచ్చారు.