Kishan Reddy: కాళేశ్వరంపైసీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదు: కాంగ్రెస్‌కు కిషన్ రెడ్డి సూటిప్రశ్న
Kaleswaram Project: సీబీఐ దర్యాప్తు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కోరడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
CBI enquiry over Kaleswaram Project: వరంగల్: తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తే.. కాళేశ్వరంపై దర్యాప్తు చేయడానికి సీబీఐ సిద్ధంగా ఉందని కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. గత సీఎం, బీఆర్ఎస్ నాయకులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కోరడంలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. వరంగల్ పర్యటనలో హనుమకొండలోని స్తంభాల గుడి కళ్యాణ మండపం, వరంగల్లోని కాకతీయ జరుగుతున్న పనులను మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు.
కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన నాణ్యత, ప్లానింగ్, డిజైనింగ్ అక్రమాలను బయటపట్టడానికి విజిలెన్స్‌కు సామర్థ్యం ఉండదన్నారు. బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మేము వివరాలు కోరితే.. మాదగ్గర వివరాలు లేవని ప్రాథమిక సమాచారం ఇచ్చారని.. డ్యామ్ సేఫ్టీ అథారిటీ దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల రక్షణ చూస్తుందన్నారు. గత సంవత్సరం అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని వార్తలు రాగానే.. వెంటనే అక్టోబర్ 22న తాను కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాసినట్లు కిషన్ రెడ్డి గుర్తుచేశారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మించిందని, అప్పుడే పిల్లర్లు కుంగిపోయాయని, ప్రాజెక్టు నాణ్యతపై దర్యాప్తు చేపట్టి.. చర్యలు తీసుకోవాలని నేను ఉత్తరం రాశానన్నారు. తర్వాతి రోజే.. భారత ప్రభుత్వ జలశక్తి శాఖ డ్యామ్‌సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి మేడిగడ్డకు పంపామని తెలిపారు. అక్టోబర్ 24, 25న ఆ రెండు రోజులు డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్ర అధికారులను వివరాలు అడిగిందని చెప్పారు.
గతేడాది నవంబర్1న డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక ప్రాథమిక నివేదిక తయారు చేసి రాష్ట్రానికి పంపింది. దాని ప్రకారం ప్రాజెక్టు సర్వే, ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణం, ఆపరేషన్, నిర్వహణ ఏదీ సరిగ్గా లేవని వెల్లడించిందని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రమాదకర పరిస్థితిలో డ్యామ్ ఉన్నదని, నీటిని ఖాళీ చేయాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన తర్వాత.. నాటి బీఆర్ఎస్ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము లేఖలు రాసినా.. ఎలాంటి స్పందన లేదని కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు తప్ప, కాంగ్రెస్ చేతలు లేవని ఎద్దేవా చేశారు.
డ్యామ్ సేఫ్టీ అథారిటీ వివరాలు అడిగితే.. రాష్ట్ర ప్రభుత్వం వివరాలు ఇవ్వడం లేదు. మళ్లీ సందర్శనకు వస్తామంటే కూడా రాష్ట్ర సర్కారు అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష పార్టీ, పాలక పార్టీ కూడబలుక్కోని నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. మేడిగడ్డ ప్రమాదంలో ఉందని తెలిసినా.. ఈ రెండు నెలల సమయం రాష్ట్ర ప్రభుత్వం వృథా చేసిందన్నారు. విజిలెన్స్ దర్యాప్తు అంటున్న రాష్ట్ర సర్కారు... విజిలెన్స్ ఏం చేయగలదో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. విజిలెన్స్ నివేదిక అని చెప్తున్న ప్రభుత్వం.. అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదికనే పొందుపరిచారని గుర్తుచేశారు..
పొలిటికల్ మైలేజ్ కోసం కాంగ్రెస్ యత్నాలు
మేడిగడ్డ డ్యామేజీ వ్యవహారాన్ని పొలిటికల్ మైలేజ్ కోసం కాంగ్రెస్ వాడుకుంటోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ బంద్ పెట్టి.. మేడిగడ్డకు ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇంతకు ముందే మంత్రులు చూశారు. రేవంత్, రాహుల్‌గాంధీ సైతం ప్రాజెక్టును పరిశీలించారు.. ఇప్పుడు మళ్లీ ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ- తీరు సైతం అలాగే ఉందన్నారు. ప్రజాసమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి వెళ్లని కేసీఆర్.. నల్గొండ బహిరంగ సభకు వెళ్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులపై పెత్తనం చెలాయిస్తుందని తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని... నాగార్జున సాగర్ డ్యామ్ పై ఏపీ పోలీసులు చేరి ముళ్లకంచెలు వేసి, తుపాకులతో ఆంధ్రా పోలీసులు ఉంటే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 2014 చట్టం ప్రకారం.. ట్రిబ్యునల్ సమక్షంలోనే ప్రాజెక్టుల సమస్య పరిష్కారం కావాలని, కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదన్నారు.
ఆంధ్రా రాష్ట్రం పోలీసులను పెట్టి బలవంతంగా నీళ్తు తీసుకుపోతే.. ఏం చేయాలో ఇప్పటి వరకు యాక్షన్ ప్లాన్ ఏంటో రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదన్నారు. రెండు నెలలైన మీ వైఖరి ఏమిటో చెప్పాలి? ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటారో చెప్పాలని.. మీరు పరిష్కరించుకుంటే.. కేంద్రం జోక్యం చేసుకోదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల సమస్య వస్తే.. పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని.. కానీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత నిర్వర్తిస్తే.. ఒక మాట, నిర్వహించకుంటే మరొక మాట అనడాన్ని కిషన్ రెడ్డి తప్పుపట్టారు.