What Next Revanth: పార్టీ పరమైన రిజర్వేషన్లా? న్యాయపోరాటం కొనసాగింపా? -స్థానిక ఎన్నికలపై రేవంత్ ప్లానేంటి ?
BC Reservetions: స్థానిక ఎన్నికలపై రేవంత్ ముందు ఇప్పుడు రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఒకటి న్యాయపోరాటం చేయడం.. రెండు పార్టీ పరమైన రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లడం.

What is Revanth Plan B on local elections: తెలంగాణ రాజకీయాలు బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవో ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఇచ్చారు. నోటిఫికేషన్ కూడా గురువారం వచ్చింది. కానీ కోర్టు ఇచ్చిన స్టే కారణంగా రిజర్వేషన్లు చెల్లవు కాబట్టి ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది. కోర్టు ఆదేశాలను గౌరవిస్తామని ఎస్‌ఈసీ ప్రకటన చేసింది. ఇప్పుడు రేవంత్ ముందు స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి న్యాయపోరాటం కొనసాగించడం .. రెండు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలను నిర్వహించేయడం.
ఎన్నికలు జరపాలనుకుంటే పార్టీ పరమైన రిజరవేషన్లతో నిర్వహణ
స్థానిక ఎన్నిక ఎన్నికలను రేవంత్ నిర్వహించాలనుకుంటున్నారా.. వద్దనుకుంటున్నారా అన్నదానిపైనే తదుపరి ప్రభుత్వ వ్యూహం ఆధారపడి ఉంటుందని అనుకోవచ్చు. స్థానిక ఎన్నికలను నిర్వహించాలనుకుంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల జీవో ఆధారంగానే .. షెడ్యూల్ మార్చి.. నోటిఫికేషన్ జారీ చేస్తారు. అలా చేస్తే రాజకీయపరమైన విమర్శలు, బీసీలను మోసం చేశారన్న ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే దీనికి పరిష్కారంగా న్యాయపరమైన వివాదాలు ఉన్నాయి కాబట్టి పార్టీ పరమైన రిజర్వేషన్లు ఇస్తున్నామని .. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ఇతర పార్టీలు అదే విధంగా రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. అలా చేయడం వల్ల ఎదురుదాడి చేయవచ్చు.
ఎన్నికలు వద్దనుకుంటే న్యాయపోరాటం
ఒక వేళ స్థానిక ఎన్నికలు ఇప్పుడు అవసరం లేదని.. అదో తలనొప్పని రేవంత్ రెడ్డి అనుకుంటే న్యాయపోరాటానికి మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం హైకోర్టు లో విచారణ జరగాలంటే.. నాలుగువారాలు పడుతుంది. అందుకే మంత్రి వాకిటి శ్రీహరి తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రకటించారు. అలా వెళ్తే అక్కడ రిలీఫ్ వస్తుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే రిజర్వేషన్ల జీవోలో అన్ని సంక్లిష్టతలు ఉన్నాయి. న్యాయపోరాటం ఎంత కాలం సాగుతుందో చెప్పలేరు. అంత కాలం ఎన్నికలు నిర్వహించకుండా ఉండలేరు.
ఎన్నికలు పెట్టకపోతే బ్యాక్ లాగ్‌లా ఉండిపోతాయి !
స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే.. బ్యాక్ లాగ్‌లా ఎప్పటికీ అలా ఉండిపోతాయి. ఎందుకంటే లోకల్ పోల్స్ కోసం గ్రామస్థాయి క్యాడర్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. గత పన్నెండేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు రాజకీయ పరమైన పదవులు లేవు. గ్రామాల్లో, మండలాల్లో అధికారం లేదు. ఇప్పుడు ఆ అదికారాన్ని కోరుకుంటున్నారు. ఎలాగైనా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలన్నా.. ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి. ఎన్నికలను వాయిదా వేసుకుంటూ పోతే.. భారంగా మారతాయి కానీ.. ప్లస్ అయ్యే అవకాశాలు ఉండవు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి కూడా వీలైనంత త్వరగా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తారని.. దానికి ప్లాన్ బీ అమలు చేస్తారని గట్టిగా నమ్మతున్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది రెండు, మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.





















