Warangal News: వరంగల్లో బ్రేకులు పడ్డ కారు కదులుతుందా? లేక కాంగ్రెస్ హవానా?
Telangana News: లోక్ సభ ఎన్నికల వేళ మారుతున్న రాజకీయ పరిణామాలతో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంపై ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా ఉంది.
Warangal Politics: రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న హస్తం పార్టీ హవా వరంగల్ లో కొనసాగుతుందా? లేదా ఉద్యమాల గడ్డ వరంగల్లో బ్రేకులు పడ్డ కారు కదులుతుందా? కమలం వికసిస్తుందా..? అనే సందేహాలు ఎన్నో. సామాజిక, రాజకీయ, విప్లవోద్యమాలకు కేంద్ర బిందువు వరంగల్. ప్రజా ఉద్యమాలతో పాటు రాజకీయాల్లో రాష్ట్ర, దేశ స్థాయిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మారుతున్న రాజకీయ పరిణామాలతో తెలంగాణలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంపై ప్రధాన పార్టీలు గురిపెట్టాయి.
ముగ్గురు అభ్యర్థులు గులాబీ పార్టీతో లింక్
వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తున్న బీఅర్ఎస్ లో పాటు బీజేపీ, కాంగ్రెస్ ముగ్గురు అభ్యర్థులు గులాబీ పార్టీ వెళ్లిన వలస నేతలే. బిజేపి నుంచి పోటీ చేస్తున్న ఆరూరి రమేష్ 2010 నుండి బీఅర్ఎస్ లో కొనసాగుతూ రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారు. బీఅర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో బీజేపీలో చేరి బీజేపీ అభ్యర్థిగా పార్లమెంట్ బరి లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య కూడా బీఅర్ఎస్ గూటి పక్ష తండ్రి 2012 నుండి బీఅర్ఎస్ లో కొనసాగి ఉప ముఖ్యమంత్రిగా పని చేసి మొన్నటి ఎన్నికల్లో బీఅర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ కూతురుతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. ఇక బీ అర్ ఎస్ అభ్యర్థి హనుమకొండ జడ్పీ చైర్ మెన్ గా కొనసాగుతూ సుధీర్ కుమార్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగారు.
త్రిముఖ పోటీ..
ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పేలా లేదు. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ గెలుపు ధీమాతో ఉండగా. బీఆర్ ఎస్ అసెంబ్లీ ఎన్నికల ఓటమితో దిద్దుబాటు చర్యలతో సత్తా చాటడం కోసం ప్రయత్నాలు చేస్తుంది. కాషాయదళం ఈసారి వరంగల్ పార్లమెంట్ లో పాగా వేసి 40సంవత్సరాల చరిత్రను తిరగారాయాలని చూస్తుంది. బిజేపి, కాంగ్రెస్ పార్టీలు మండలాల వారిగా కార్యకర్తల సమావేశం నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు. బీ అర్ ఎస్ అభ్యర్థిని రెండు రోజుల క్రితమే ప్రకటించడంతో బీ అర్ ఎస్ నేతలు రంగంలోకి దిగుతున్నారు. ఏదేమైనా ఈసారి మూడు పార్టీలు పదునైన విమర్శలతో ఢీ అంటే ఢీ అంటున్నాయి.
బీఅర్ఎస్ కు కంచుకోట
టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీకి అండగా ఉంది వరంగల్. 2009 నియోజకవర్గ పునర్‌వ్యవస్థీకరణకు ముందు, తరువాత వరంగల్ పార్లమెంట్ లో బీఅర్ఎస్ పాగా వేసింది. 2009లో ఎస్సీ రిజర్వుడు అయిన వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009 కాంగ్రెస్, 2014, 2019లో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో విజయం సాధించాయి.
వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి ఏడు అసెంబ్లీ నియోజకవర్గం వస్తాయి. భూపాలపల్లి, పరకాల, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాలు. ఇందులో గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ మినహా ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు విజయం సాధించారు. స్టేషన్ ఘనపూర్ లో గెలిచిన బీ అర్ ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినా కాంగ్రెస్ పార్టీ గెలుపు అంతా సులువుగా లేదు.
అభివృద్ధి..
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండవ రాజధానిగా చెప్పుకొనే వరంగల్ నగరంతోపాటు వ్యవసాయంపై ఆధారపడే ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాదు తరువాత రెండవ రాజధానిగా చెప్పుకోవడమే తప్ప అభివృద్ధి జరగలేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాజీపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం ఎడ్ల తరబడి నగరవాసుల కలగానేమిగిలింది. నగరంలో జాతీయ స్థాయీ విద్యాసంస్థలు ఉన్న ఐటీ కంపెనీలు రావడంలేదు. నగర అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్న నగరం అభివృద్ధికి నీచుకోవడంలేదు. ఇక రూరల్ ప్రాంతంతో వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టులు లేకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గాయి. రాకరాక టెక్స్టైల్ పార్క్ వచ్చిన ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఎన్నికల ముందు హామీ లు ఇవ్వడమే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ సారి ప్రజలు ఎవరిని నమ్ముతారు. జాతీయ వాదమా.. ప్రాంతీయ వాదమా... అభివృద్ధి వాదమా ఎవరికి పట్టం కడతారో చూడాలి.