Revanth Reddy: ప్రగతి భవన్‌ను పేల్చేసినా ఏం కాదు, దుమారం రేపుతున్న రేవంత్ వ్యాఖ్యలు - BRS ఆందోళన
రేవంత్ రెడ్డి మూడో రోజు పాదయాత్ర నేడు మహబూబాబాద్‌లో జిల్లా కొనసాగనుంది. కేసముద్రం మండలం పెనుగొండ గ్రామంలో జెండా ఆవిష్కరణతో యాత్ర ప్రారంభం కానుంది.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్‌ను పేల్చివేయాలంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒకవేళ నక్సలైట్లు ప్రగతి భవన్‌ను పేల్చివేసినా ఎవరికీ అభ్యంతరం లేదని అన్నారు. పేదలకు కేసీఆర్ డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వలేదు గానీ, హైదరాబాద్ మధ్యలో మాత్రం 2 వేల కోట్లు ఖర్చు పెట్టి 150 గదులతో ప్రగతి భవన్ కట్టుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రగతి భవన్‌లోకి పేదలకు ప్రవేశమే లేదని అన్నారు. అలాంటి ప్రగతి భవన్ ఎందుకని మండిపడ్డారు. ఆనాడు గడీలను నక్సలైట్లు గ్రానేట్‌లతో పేల్చేవారని, ఇప్పుడు బాంబులతో ప్రగతి భవన్‌ను పేల్చి వేయాలంటూ ఘాటుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ ఆనాటి గడీలను తలపిస్తుందని అన్నారు.
రేవంత్‌రెడ్డి చేపట్టిన హాత్‌సే హాత్ జోడో యాత్ర రెండో రోజు మంగళవారం (జనవరి 7) ములుగు జిల్లాలో కొనసాగింది. ఉదయం రామప్ప ఆలయాన్ని సందర్శించిన ఆయన రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ములుగు జిల్లా కేంద్రం వరకు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పలుచోట్ల ప్రజలు, రైతులతో ముచ్చటించారు. మీడియాతో, ములుగులో రాత్రి జరిగిన రోడ్ షోలో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అద్దాల మేడల తరహాలో కలెక్టరేట్ల నిర్మాణం చేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ధరణి పేరుతో లక్షలాది ఎకరాల భూములను దొంగిలిస్తూ భూసమస్యలు పరిష్కరించని అద్దాల మేడలు ఎందుకు అని ప్రశ్నించారు.
పోలీసులకు ఫిర్యాదు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రగతి భవన్ నక్సలైట్లు పేల్చివేసిన నష్టమే ఉండదని వ్యాఖ్యానించడంపై వారు ఆందోళన చేస్తున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ములుగు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తే యాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు.
నేడు మహబూబాబాద్ జిల్లాలో యాత్ర
రేవంత్ రెడ్డి మూడో రోజు పాదయాత్ర నేడు మహబూబాబాద్‌లో జిల్లా కొనసాగనుంది. కేసముద్రం మండలం పెనుగొండ గ్రామంలో జెండా ఆవిష్కరణతో యాత్ర ప్రారంభం కానుంది. కాంగ్రెస్ శ్రేణులు తొర్రూరు బస్టాండ్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రాత్రి పెద్దవంగర వద్ద రేవంత్ బస చేయనున్నారు.