Preethi Death Issue: ప్రీతిది హత్య అని ఆధారాలున్నాయ్, మీదగ్గరున్నాయా? - సోదరుడు సంచలన ఆరోపణలు
ప్రీతిని ఎక్మోపై ఉంచినప్పుడు బ్లడ్ అంతా మార్చేశారని, అలాంటప్పుడు పోస్ట్ మార్టంలో ప్రీతి శరీరంలో ఉన్న ఇంజెక్షన్ ఆనవాళ్లు ఎలా తెలుస్తాయని ప్రశ్నించాడు.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి మరణంపై ఆమె సోదరుడు అనుమానాలు వ్యక్తం చేశాడు. ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్య అని ఆరోపించాడు. అందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని, ఆత్మహత్య అనేందుకు మీ వద్ద ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించాడు. ప్రీతి ఆత్మహత్య చేసుకొని వాట్సప్‌లోని చాట్స్ ఎలా డిలీట్ అయి ఉంటాయని నిలదీశాడు. తన సోదరి ప్రీతి మరణంపై ప్రశ్నలు లేవనెత్తుతూ ఆయన సోదరుడు పృథ్వీ ఒక విడుదల చేశాడు.
ప్రీతిని ఎక్మోపై ఉంచినప్పుడు బ్లడ్ అంతా మార్చేశారని, అలాంటప్పుడు పోస్ట్ మార్టంలో ప్రీతి శరీరంలో ఉన్న ఇంజెక్షన్ ఆనవాళ్లు ఎలా తెలుస్తాయని ప్రశ్నించాడు. నిమ్స్‌లో ఏం వైద్యం చేశారనేది తమకు చెప్పాలని డిమాండ్ చేశాడు. ప్రీతిని తరలించేటప్పుడు తాను ఆంబులెన్స్‌లో ఉన్నానని, ఆమె 9 గంటల టైంలో చనిపోతే, రాత్రి ఒంటిగంట సమయానికి ఆమె శరీరం ఎందుకు విపరీతమైన వాసన వచ్చిందని అడిగారు. నిమ్స్‌లో ప్రీతి పొత్తి కడుపు వద్ద సర్జరీ చేశారని పృథ్వీ తెలిపాడు. ఆ సర్జరీ ఎందుకు చేశారనేది తెలియడం లేదని అన్నాడు. అలాగే ప్రీతికి చేతిపై గాయం కూడా ఉందని చెప్పాడు. ప్రీతికి పూర్తిగా శరీరంలో బ్లడ్ డయాలిసిస్ చేశారని తెలిపాడు.
కౌన్సెలింగ్ పైనా అనుమానాలు!
ప్రీతి సెల్ ఫోన్‌లో మెసేజ్‌లను తాను చూశానని పృథ్వీ వెల్లడించాడు. తనకు కనిపించని మెసేజ్‌లు పోలీసులకి ఎలా కనిపించాయని అడిగాడు. నాగార్జున రెడ్డి కమిటీ రిపోర్ట్‌ను మార్చి ఉంటారని పృథ్వీ అనుమానం వ్యక్తం చేశాడు. ర్యాగింగ్ కమిటీపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని అన్నాడు. తన సోదరికి, సైఫ్‌కి కలిపి కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్పినది అంతా పూర్తి అబద్ధమని తెలిపాడు. హెచ్‌వోడీ పిలిచి తన సోదరిని కనీసం ఎలాంటి వివరణ అడక్కుండా తిట్టాడని ఆరోపించాడు. మొత్తం సైఫ్‌కు మద్దతుగా ఉన్న నాగార్జున రెడ్డితో కమిటీని ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించాడు. అలా కమిటీని ఏర్పాటు చేస్తే సైఫ్‌కి ఫేవర్‌గానే రిపోర్ట్ ఇస్తాడు కదా? అని ప్రశ్నించాడు.
ప్రీతిని సైఫ్ ర్యాగింగ్ చేశాడు.. కమిటీ నిర్ధారణ
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ప్రీతి మరణంపై యాంటీ ర్యాగింగ్ కమిటీ బుధవారం సమావేశమైంది. దాదాపు నాలుగు గంటలపాటు కమిటీ సభ్యులు పలు అంశాలపై చర్చించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. ప్రీతిని సైఫ్ మానసికంగా వేధించాని, ఇది కచ్చితంగా ర్యాగింగ్ కిందకి వస్తుందని, ర్యాగింగ్ జరిగిందని కమిటీ నిర్ధారించింది. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ మోహన్ దాస్ అధ్యక్షతన మొత్తం 13 మంది యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి ముందు ఏం జరిగింది, అందుకు గల కారణాలపై కీలకంగా చర్చ జరిగింది.
ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చామన్న హెచ్ఓడీ
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో గత ఏడాది నవంబర్ 18న ప్రీతి అడ్మిషన్ పొందింది. అయితే సీనియర్ సైఫ్, ప్రీతికి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి అనే అంశంపై కమిటీ చర్చించింది. జీఎంహెచ్ ఆసుపత్రిలో అనస్తీషియా రిపోర్ట్ విషయం ఒక్కటే సైఫ్, ప్రీతికి మధ్య గొడవకు కారణం కాదని తేలింది. సైఫ్ తనను టార్గెట్ చేసి వేధిస్తున్నాడని హెచ్ఓడీ నాగార్జున రెడ్డికి ప్రీతి ఫిర్యాదు చేసింది. ఏడుస్తూ తనకు తలెత్తిన సమస్యను, వేధింపులను ప్రీతి ఫిర్యాదు చేసినట్లు హెచ్ఓడీ వెల్లడించారు. దీనిపై ప్రీతి, సైఫ్ ను పిలిచి కొందరు వైద్యుల సమక్షంలో ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి జాగ్రత్తగా నడుచుకోవాలని సూచించినట్లు యాంటీ ర్యాగింగ్ కమిటీకి HOD తెలిపారు.
ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చిన తరువాత సైతం ప్రీతిని సైఫ్ వేధించాడని కమిటీ గుర్తించింది. కనుక మానసిక వేధింపులు సైతం ర్యాగింగ్ కిందకే వస్తుందని, ర్యాగింగ్ జరిగినట్లు ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. అయితే మానసిక వేధింపులు జరిగాయి, కానీ లైంగిక వేధింపులు లేవన్నారు. ఇదే నివేదికను ఢిల్లీలోని యూజీసీతో పాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కు పంపిస్తామని చెప్పారు. పైనుంచి వచ్చే ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.