KCR Birthday : వరంగల్ లో వినూత్నంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలు- తాంబూలం, టవల్ తో పాటు రూ.116 కానుక
KCR Birthday : సీఎం కేసీఆర్ 69వ పుట్టిన రోజు వేడుకలను బీఆర్ఎస్ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. వరంగల్ ఓ నేత.. కేసీఆర్ బర్త్ డే వేడుకలు వినూత్నంగా చేశారు.
KCR Birthday : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని బీఆర్ఎస్ నేత వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. సంక్షేమ క్యాలెండర్ తో పాటు తాంబూలం, టవల్ తో పాటు 116 రూపాయలు స్థానికులకు పంచిపెట్టారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరే విధంగా ప్రచారం చేయడమే తన లక్ష్యమని బీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి అన్నారు. వరంగల్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల క్యాలెండర్, మహిళలకు తాంబూలం, పురుషులకు టవల్ తోపాటు 116 రూపాయలు నగదు పంపిణీ చేశారు. కోట్ల రూపాయలు వృథా చేసి జన్మదిన వేడుకలు జరపడం కాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లో ప్రచారం చేయడమే తన లక్ష్యమన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని శ్రీహరి జోష్యం చెప్పారు.
మొక్కలు నాటి పుట్టినరోజు వేడుకలు
సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాయి. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ నలుమూలల్లో సంబురాలు జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వినయ్ భాస్కర్, కుడా ఛైర్మన్ సుందర్ రాజ్, నగర మేయర్ గుండా సుధారాణి బాలసముద్రంలోని పార్క్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని కేసీఆర్ ఉద్యాయ వనంగా మారుస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని నగరంలోని ప్రార్థనా మందిరాల్లో పూజలు చేసినట్టు చెప్పారు. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.
69 కిలోల కేకు
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, సంక్షేమం, అభివృద్ధిలో మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ కు మంత్రులు, బీఆర్ఎస్ నేతలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ 69వ జన్మదిన వేడుకలను నెక్లెస్ రోడ్ లోని థ్రిల్ సిటీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు, మంత్రులు గంగుల కమలాకర్, మహమూద్ ఆలీ, సత్యవతి రాథోడ్ ఇతర నాయకుల సమక్షంలో వేడుకలు జరిగాయి. సాంస్కృతిక ప్రదర్శనలు, తెలంగాణ వైభవంపై జబర్దస్త్ ఆర్టిస్టులు స్కిట్టు వేసి ఆహుతులను అలరించారు. గంగుల పీఆర్వో గంగాడి సుధీర్ రచించిన ‘కేసీఆర్ నువ్వే ఒక చరిత్ర’ డాక్యుమెంటరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం 69 కిలోల కేకును మంత్రి గంగుల కమలాకర్ సహచర మంత్రులు కట్ చేసి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
కీసరలో ప్రత్యేక పూజలు
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కీసరలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి మల్లారెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. సీఎం పేరు మీద అభిషేకం, ప్రత్యేక పూజల నిర్వహించారు. సీఎం నేతృత్వంలో రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. సీఎం పుట్టిన రోజు సందర్భంగా కీసర అర్బన్ ఎకో పార్క్ లో మొక్కలు నాటారు మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్.