Revanth CM 2 Years: రాజకీయ పరిమితులు, ఆర్థిక సవాళ్ల మధ్య రెండేళ్లు - సీఎంగా రేవంత్ పనితీరు అంచనాలను అందుకుందా?
Telangana CM Revanth : సీఎంగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి అయ్యాయి. రేవంత్ పాలన తెలంగాణ ప్రజల అంచనాలకు అనుగుణంగా సాగుతోందా

Revanth As CM 2 Years: తెలంగాణ ప్రజల ఆశలు, అంచనాల మధ్య అనుముల రేవంత్ రెడ్డి అనే నేను అంటూ.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి రెండేళ్లు అయింది. అంటే పదవి కాలంలో నలభై శాతం పూర్తి అయింది. తనదైన మార్క్ చూపించడానికి రెండేళ్ల సమయం సరిపోతుంది. ఆయనపై ప్రజలు పెట్టుకున్న అంచనాలకు తగ్గట్లుగా పాలన సాగుతోందా ?. సంక్షేమం విషయంలో ఇచ్చిన హామీలను నేరవేర్చారా?. అభివృద్ధి విషయంలో తనదైన మార్క్ చూపించగలుగుతున్నారా?
ఆర్థికంగా పెను సవాళ్లు
ముఖ్యమంత్రి పదవి రాగానే అన్నీ చేసేయాలనుకుంటా రు. కానీ ఏమీ చేయలేరు. ఎందుకంటే.. పదవిలోకి వచ్చే సరికే ఎన్నో ప్రతిబంధకాలు ఉంటాయి. అందులో మొదటివి ఆర్థికపరమైనవే. ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా వీలయినంతగా వెసులుబాటు కల్పించుకుని తీరికగా ఉండటం లేదు. తలకు మించిన అప్పుల భారం మోసుకుంటూనే ఉన్నాయి. అలాంటి భారమే రేవంత్ రెడ్డికి బాధ్యతల బరువుగా వచ్చింది. రెండేళ్లుగా పథకాల అమలుకు.. అభివృద్ధి పనుల కోసం నిధుల సవాళ్లతో సతమతమవుతూనే ఉన్నారు. అప్పులు తెచ్చి..భూములు అమ్మి ఎక్కడిక్కకడ ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కొన్ని సార్లు ఎదురుదెబ్బలు తప్పడం లేదు. కంచగచ్చిబౌలి భూములు.. హిల్ట్ పాలసీ ఇలా ఆదాయ సమీకరణ మార్గాలన్నింటిపై విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
సంక్షేమం విషయంలో మెరుగైన పనితీరు
ఎన్ని ఆర్థిక సవాళ్లు ఉన్నా.. సీఎం రేవంత్ సంక్షేమ పథకాల విషయంలో ప్రజల అంచనాలను అందుకున్నారనే అనుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన తొలి రోజునే.. పరిస్థితి ఏమిటి... ఎలా అన్నది ఆలోచించకుండా ఉచిత బస్సును ప్రారంభించేశారు. ఎంత కష్టమైనా భరించక తప్పదన్న ఉద్దేశంతో ఆ పథకం ప్రారంభించారు. రెండేళ్లుగా 90 శాతం మంది మహిళలు ఒక్క సారి అయినా ఈ పథకం ద్వారా లబ్దిపొంది ఉంటారు. పేద మహిళలు ఈ పథకం ద్వారా ఎంతో కొంత మిగుల్చుకుంటారు. ఇక రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరిగింది. సిలిండర్ పథకం, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలవుతోంది. సన్నబియ్యం పథకం మరో బెంచ్ మార్క్. రేషన్ కార్డు మీద సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లపథకాన్నీఅమలు చేస్తున్నారు. అయితే సామాజిక పెన్షన్లు పెంచలేకపోవడంతో పాటు తులం బంగారం హామీ వంటివి మాత్రం ఇప్పటికీ ప్రశ్నించడానికి అవకాశం కల్పిస్తున్నాయి.
అభివృద్ధి విషయంలో అంతంతమాత్రమే!
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఎన్నో ప్రణాళికలు వేశారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ సహా అభివృద్ధిలో తన దైన మార్క్ చూపిస్తానన్నట్లుగా హడావుడి చేశారు. కానీ రెండేళ్ల తర్వాత ఆ ప్రణాళికల్లో ఎంత పురోగతి అని ఆాలోచిస్తే.. ఇంకా ప్రణాళిక దశల్లోనే ఉంది. ఫ్యూచర్ సిటీలో టెంట్లు వేసి.. పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నారు. మూసి ప్రక్షాళన ప్రాజెక్టు ఇప్పటికీ ముందుకు పడలేదు. మెట్రో విస్తరణకు శంకుస్థాపన చేశారు కానీ .. ఎక్కడిదక్కడే ఉంది. కేంద్రం కనీసం రెండో విడతకు అనుమతి ఇవ్వలేదు. పైగా మెట్రోను పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇక రోడ్లపై గుంతల సమస్యల గురించీ విమర్శలు వస్తున్నాయి. రేవంత్ చెప్పిన మాటలకు.. జరుగుతున్న పనులకు పెద్దగా పొంతన లేదని ప్రజలు చర్చించుకునే పరిస్థితి కనిపిస్తోంది.
రాజకీయంగా బలపడిన రేవంత్
కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితుల వల్ల తిరుగులేని నేతగా ఎదగడానికి అవకాశం ఉండదు. ఎప్పటికప్పుడు కాళ్లు, చేతులు కట్టేస్తూనే ఉంటారు. అయినా రేవంత్ తన పట్టు నిరూపించుకుంటూనే ఉన్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అవసరమైనప్పుడల్లా అండగా ఉన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని సమకూర్చారు. జాతీయ రాజకీయాలకు ఆయన వ్యూహాలే దిక్సూచీ అయ్యాయి. రెండేళ్లలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. రెండింటిని కాంగ్రెస్ ఖాతాలో వేసుకుని ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకున్నారు. ఎలా చూసినా..రెండేళ్ల పాలనలో రేవంత్ అద్భుతమైన విజయాలు.. భయపడాల్సినంత పరాజయాలు ఏమీ చాూడలేదు. కట్టా..మీఠాగా పాలన సాగిపోయిందని అనుకోవచ్చు.





















