TRS Meeting: నేడు టీఆర్ఎస్ కీలక భేటీ... దళిత బంధు, హుజురాబాద్ ఉపఎన్నికపై శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం సమావేశం ఇవాళ జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో గులాబీ శ్రేణులకు దళిత బంధుపై దిశానిర్దేశం చేయనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన... టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం కీలక సమావేశం ఇవాళ జరగనుంది. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియ ఇటీవల పూర్తయింది. టీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రమాదబీమా సొమ్మును పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బీమా సంస్థలకు అందజేశారు. గులాబీ శ్రేణులకు ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
దళిత బంధుపై దిశానిర్దేశం
దళితుల అభివృద్ధే లక్ష్యంగా దళితబంధు పథకం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర భవన్‌లో పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు, నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, హుజురాబాద్ ఉపఎన్నికల అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఆ సమావేశంలో దళిత బంధు పథకంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ పథకం అమలులో పార్టీ శ్రేణుల బాధ్యత, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై చర్చించనున్నారు.
దళిత కాలనీల అభివృద్ధి
ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గంతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు పాల్గొంటారు. సమావేశంలో దళితబంధు ప్రాధాన్యతలు, పథకం రూపకల్పన వెనక ఉన్న ఉద్దేశ్యాలపై సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు వివరించనున్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ పథకంపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దళిత కాలనీలను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.
పార్టీ పాత్రపై
పార్టీ సంస్థాగత నిర్మాణంపైనా నేతలతో సీఎం కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. పార్టీ సభ్యత్వ నమోదు ఇప్పటికే పూర్తయ్యింది. దీంతో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీల నిర్మాణంపై కేసీఆర్ దృష్టి సారించారు. ఉద్యమ కారులు, మహిళలు, అన్ని వర్గాలకు పార్టీ కమిటీల్లో ప్రాధాన్యమివ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో టీఆర్ఎస్ పాత్రపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇతర ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.