TS News Developments Today: నేడు జిల్లా కేంద్రాల్లో BRS ధర్నాలు, రైతులు పాల్గొనాలని కేటీఆర్ పిలుపు
జాతీయ ఉపాధి హామీ పథకం లో రైతు కల్లాల నిర్మాణం పై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ ఉదయం పది గంటలకు నిజామాబాద్ కలక్టరేట్ వద్ద జరగనున్న మహా ధర్నా లో ఎమ్మెల్సీ కవిత పాల్గొంటారు.
కల్లాలపై గల్లాపట్టుడే.. నేడు రాష్ట్రవ్యాప్తంగా BRS ధర్నాలు
తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుదామని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ర్ట పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉపాధి నిధులతో తెలంగాణ రైతుల కోసం కల్లాలు నిర్మించుకుంటే మోదీ కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం తీరుకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాకేంద్రాల్లో ధర్నాలు చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాలపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. రైతులకు ఉపయోగపడే సిమెంటు కల్లాల నిర్మాణంపై కావాలనే కేంద్రం రాద్ధాంతం చేస్తున్నదని విమర్శించారు. మంచి కార్యక్రమం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతులకు చేసిన సహాయాన్ని ఉపాధి నిధుల మళ్లింపుగా దుష్ప్రచారం చేస్తుండటంపై కేటీఆర్ మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందుకు, తెలంగాణపై అసత్య ప్రచారం చేస్తున్నందుకు నిరసనగా శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
నేడు జిల్లా కేంద్రాల్లో BRS ధర్నాలు
మోటర్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేసిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం.. అందుకు తెలంగాణ అంగీకరించకపోవడంతో మరో కుట్రకు తెర లేపిందని కేటీఆర్ నిప్పులుచెరిగారు. ‘మన రైతుల కోసం బావుల కాడ వడ్లు ఆరబెట్టుకోడానికి ప్రభుత్వం కల్లాలు నిర్మించాలని అనుకోవడం నేరమా? రాష్ట్ర ప్రభుత్వం కల్లాలను నిర్మిస్తే, ఆ నిధులను వెనక్కి ఇవ్వాలని అడగడం న్యాయమా? ఇదేనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రైతులపై ఉన్న ప్రేమ?’ అని ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరిత వైఖరికి నిరసనగా అన్ని జిల్లాకేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో తెలంగాణ రైతులు స్వచ్ఛందంగా పాల్గొనాలని, వీరితోపాటు బీఆర్‌ఎస్ శ్రేణులు కేంద్రం తీరుకు వ్యతిరేకంగా నినదించాలని ఆయన పిలుపునిచ్చారు.
నిజామాబాద్ లో జరిగే ధర్నాలో ఎమ్మెల్సీ కవిత
జాతీయ ఉపాధి హామీ పథకం లో రైతు కల్లాల నిర్మాణం పై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ ఉదయం పది గంటలకు నిజామాబాద్ కలక్టరేట్ వద్ద జరగనున్న మహా ధర్నా లో ఎమ్మెల్సీ కవిత పాల్గొంటారు..
నేడు దిగ్విజయ్ సింగ్ మరోసారి భేటి కానున్న నేతలు
కాంగ్రెస్ పార్టీ దూతగా రాష్ట్రానికి వచ్చిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ లో అంతర్గత సమస్యల పరిష్కారానికి చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గురువారం ఆయన పార్టీలోని నేతలతో భేటి అయ్యారు. ఈ రోజు కూడా ఆయన పలువురు నేతలతో భేటి కానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడనున్నారు. నేతలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తో ఆయన మధ్యాహ్నం తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్టానంకు నివేదిక అందించనున్నారు. ఢిల్లీలో కూడా ఆయన రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలతో భేటి కానున్నారు.
నేటి నుంచి గ్రూప్-4 అప్లికేషన్స్ స్వీకరణ
రాష్ట్రంలో 9168 గ్రూప్-4 పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఈ రోజు నుంచిజనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గ్రూప్-4 ఉద్యోగాల్లో నాలుగు కేటగిరీ పోస్టులున్నాయి. వీటిలో కేటగిరీ-1లో జూనియర్ అకౌంటెంట్ - 429 పోస్టులు, కేటగిరీ-2లో జూనియర్ అసిస్టెంట్ - 6,859 పోస్టులు, కేటగిరీ-3లో జూనియర్ ఆడిటర్ - 18 పోస్టులు, వార్డు ఆఫీసర్ - 1,862 పోస్టులు ఉన్నాయి.
నేడు పోలీసుల ముందుకు సునీల్ కనుగోలు?
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వార్ రూమ్ కేసులో ప్రధాన నిందితుడైన ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు నేడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ముందు హాజరు కానున్నట్లు తెలిసింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతోపాటు ప్రధాని మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ తదితరులను టార్గెట్ చేసి, వారి ముఖచిత్రాల మార్ఫింగ్‌తో అసభ్యకర వీడియోలు రూపొందించి, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారన్న కేసులో సునీల్ ప్రధాన నిందితుడు. మాదాపూర్‌లోని ఆయన కార్యాలయంపై పోలీసులు ఇటీవల దాడి చేశారు. ఈ కేసులో ఇప్పటికే శ్రీప్రతాప్, శశాంక్, ఇషాన్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకుని, 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేశారు. పోలీసులు దాడి నిర్వహించిన సమయానికి సునీల్ విదేశాల్లో ఉన్నాడని, శుక్రవారం హైదరాబాద్ చేరుకోనున్నట్లు సమాచారం. ఈ విషయమై ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను సంప్రదించగా.. ఆయన అందుబాటులోకి వస్తే నోటీసులిచ్చి, విచారణకు ఎప్పుడు రావాలనేది తెలియజేస్తామన్నారు.
భద్రాద్రికి ముక్కోటి శోభ.. నేటి నుంచి అధ్యయనోత్సవాలు
భద్రాద్రికి ముక్కోటి శోభ వచ్చింది. ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. తెప్పోత్సవానికి హంస వాహనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్తర ద్వారదర్శన మండపం ముస్తాబైంది. ఆలయానికి రంగులు వేయడం, ఆవరణలో చలువ పందిళ్లు.. స్వాగత ద్వారాల ఏర్పాటు వంటి పనులు పూర్తయ్యాయి. నేటి నుంచి జనవరి 12 వరకు అధ్యయనోత్సవాలు కొనసాగుతాయి. ఇందులోభాగంగా భద్రాద్రి రామయ్య 23న మత్స్యావతారంలో, 24న కూర్మావతారంలో, 25న వరాహావతారంలో, 26న నరసింహావతారంలో, 27న వామనావతారంలో, 28న పరుశురామావతారంలో, 29న శ్రీరామావతారంలో, 30న బలరామావతారంలో, 31న శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 1న తిరుమంగై ఆళ్వార్ పరమ పదోత్సవం, అదే రోజు సాయంత్రం 4.00 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. దీంతో పగల్ పత్తు ఉత్సవాలు సమాప్తమవుతాయి. 2వ తేదీ తెల్లవారుజామున 5.00 6.00 గంటల వరకు ఉత్తరద్వార దర్శనం నేత్రపర్వంగా నిర్వహిస్తారు.
బీడీఎస్, నర్సింగ్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్లు
ప్రభుత్వ, ప్రైవేట్ దంత కళాశాలల్లో బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి స్ట్రే కౌన్సెలింగ్ నోటిఫికేషన్, బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్లు విడుదల చేసింది. బీడీఎస్ మాప్ అప్ విడుత కౌన్సెలింగ్ అనంతరం ఖాళీగా ఉన్న సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు నేటి మధ్యాహ్నం 2 నుంచి శనివారం మధ్యాహ్నం 2 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ నాలుగేండ్ల డిగ్రీ కోర్సు, పోస్ట్ బేసిక్ బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ రెండేండ్ల డిగ్రీ కోర్సు, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ) కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయన్నట్టు పేర్కొన్నారు. అర్హతగల అభ్యర్థులు శుక్రవారం ఉదయం 9 నుంచి 25వ తేదీ మధ్యాహ్నం 2 వరకు కళాశాల వారీగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. సమాచారం కోసం వర్సిటీ వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చని సూచించారు.
ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో.. నిందితుల స్టేను పొడిగించిన హైకోర్టు
ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో భాగంగా ఇప్పటికే అధికారులు పలువురికి సిట్ నోటీసులు అందించారు. అయితే ఈ కేసులో నిందితుల స్టేను రాష్ట్ర హైకోర్టు పొడిగించింది. ఈ క్రమంలో బీఎల్ సంతోష్, జగ్గుస్వామితో పాటు తుషార్ కు స్టే పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల30 వరకు స్టే పెంచినట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది.
నేటి నుంచి ఐఐఎంసీలో అంతర్జాతీయ సదస్సు
అంతర్జాతీయ సదస్సు ఆవిష్కరణలు, సృజనాత్మకత, సాంకేతిక సమాచారంతో కూడిన 21వ శతాబ్దపు నైపుణ్యాలు ప్రధాన అంశంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్(ఐఐఎంసీ) ఆధ్వర్యంలో రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు దాదాపు 9 పరిశోధనా పత్రాలను సమర్పించనున్ననట్లు ఐఐఎంసీ కళాశాల ప్రిన్సిపాల్ కూర రఘువీర్ తెలిపారు. ఈ సదస్సును అంతర్జాలంతో పాటు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా మాధ్యమాల్లో వీక్షించే అవకాశం కల్పించామని తెలిపారు. ఉత్తమ పరిశోధన పత్రాలకు నగదు బహుమతులను అందజేస్తామని, ఇతర వివరాలకు 9989441134లో పద్మప్రియను సంప్రదించాలని సూచించారు.
నేడు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కరోనా పై అధ్యయన నివేదిక విడుదల
గచ్చిబౌలి ఏఏజీ హాస్పటల్ లో ఈ రోజు మధ్యాహ్నం 2 : 45 గంటలకు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్. కరోనా నేపథ్యంలో ప్రత్యేక అధ్యయన నివేదిక విడుదల చేయనున్నారు.
నేడు మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ నరసింహరావు వర్థంతి
నేడు నెక్లెస్ రోడ్ లోని పీవీ జ్జానభూమిలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలనుంచి పీవీ నరసింహారావు వర్ధంతి కార్యక్రమం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు, పలువురు అధికారులు, పీవీ కుటుంబసభ్యులు పీవీఘాట్ లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా పీవీ ఘాట్ ను సందర్శించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా పీవీ ఘాట్ కు రానున్నారు.