KCR Cabinet : కొత్త ఎమ్మెల్సీల్లో ముగ్గురికి మంత్రి పదవులు ! "ఎలక్షన్ కేబినెట్ " కోసమే కేసీఆర్ కసరత్తులా ?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా పదవులు పొందిన ఆరుగురిలో ముగ్గురికి మంత్రి పదవులు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు వెళ్లే ముందు కేబినెట్ మొత్తాన్ని కేసీఆర్ పునర్‌వ్యవస్థీకరిస్తారని చెబుతున్నారు.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సమీకరణాలు ఏమిటన్నదానిపై టీఆర్ఎస్‌లోనే కాదు.. విపక్ష పార్టీల్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది. ముందస్తు ఎన్నికల ఆలోచన ఉన్న కేసీఆర్ ... మంత్రివర్గాన్ని ఎన్నికల టీంగా రెడీ చేసుకునే ప్రక్రియలోనే ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేశారని అంటున్నారు. కేవలం మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ వ్యూహంతోనే ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ఎంపిక చేశారని అందుకే.. కుల, ప్రాంత సమీకరణాలను పట్టించుకోలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
Also Read : నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్‌లో హీట్. రాజ్యసభకు కవిత? ఎమ్మెల్సీకి పెరిగిన పోటీ
కుల, ప్రాంత సమీకరణాల్ని పట్టించుకోని కేసీఆర్ !
టీఆర్ఎస్ తరపున ఏకగ్రీవమయ్యే ఆరుగురు ఎమ్మెల్సీల్లో ముగ్గురు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికి కేసీఆర్ చాన్సిచ్చారు. ఒక్క దళిత, మరో వెలమ, మరో బీసీ అభ్యర్థికి చాన్సిచ్చారు. అదే సమయంలో ప్రాంతాల వారీగా చూసుకున్నా ఉత్తర తెలంగాణ నేతలకే ఐదు పదవులు ఇచ్చారు. కడియం శ్రీహరి, తక్కళ్లపల్లి రవీందర్రావు, పాడి కౌశిక్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, బండా ప్రకాశ్‌కు అవకాశం కల్పించారు. మామూలుగా అయితే అన్ని సమీకరణాలు చూసుకుని కేసీఆర్ పదవులు ఇచ్చేవారు., కానీ ఈ సారి ఆయన కేబినెట్ సమీకరణం మాత్రమే చూసుకున్నారని అందుకే ఇతర అంశాలు పట్టించుకోలేదని అంచున్నారు.
Also Read : తెలంగాణ బాలిక అరుదైన ఘనత.. సినిమాలు చూసింది.. కిలిమంజారో ఎక్కేసింది
మాజీ కలెక్టర్ ఆర్థిక మంత్రి అవుతారా ?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు మాత్రం పూర్తి స్థాయిలో మంత్రివర్గ సమీకరణాలతోనే ఎంపిక చేశారని టీఆర్ఎస్ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. ఈటల రాజేందర్ సామాజికవర్గానికి చెందిన ముదిరాజ్ వర్గీయుల్ని ఆకట్టుకోవడానికి బండా ప్రకాష్‌ను కేబినెట్‌లోకి తీసుకుని డిప్యూటీ సీఎం చేస్తారన్న ఊహాగానాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ఇక మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఫైనాన్స్ మినిస్టర్‌గా ఖరారరయ్యారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. కేసీఆర్ ఖచ్చితంగా ఈ ఆలోచనలతోనే ఆయనను ఎమ్మెల్సీ చేశారని అంటున్నారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ హరీష్ వద్ద ఉంది. ఆయనను వైద్య ఆరోగ్య శాఖకు పరిమితం చేసే అవకాశం ఉంది. ఈ ఆరుగురిలో మరొకరికి కేబినెట్ చాన్స్ ఉందని టీఆర్ఎస్ వర్గాలు నమ్ముతున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాక మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ !
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత కేసీఆర్ ఏ క్షణమైన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉంది. ఇప్పటికే వివాదాస్పదమైన మంత్రుల్ని ఆయన తొలగిస్తారని చెబుతున్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన ముగ్గుర్ని తొలగించి కొత్త వారికి చాన్సిస్తారన్న అంచనాలు ఉన్నాయి. అలాగే ఎన్నికల్లో ఇంచార్జులుగా ఉండి మంచి ఫలితాలు సాధించలేకపోయిన వారినీ తొలగించే అవకాశం ఉంది. గతంలో ఇవే హెచ్చరికలు చేశారు కూడా. ఈ కారణంగానే తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే జోరుగా చర్చ ప్రారంభమైంది. ఎన్నికల కేబినెట్ కోసమే కేసీఆర్ కసరత్తు అనే విషయాన్ని టీఆర్ఎస్ నేతలు ఎక్కువగా నమ్ముతున్నారు.
Also Read : వెంకట్రామిరెడ్డి 5 వేల ఎకరాలు ఎవరికీ బదిలీ చేశారో తెలియదు.. ఆయన రాజీనామా ఆమోదించొద్దు