Telangana News: దసరా పండుగకు ఆర్టీసీ టికెట్ చార్జీలు పెంచలేదు - ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన
TGSRTC Ticket Price Hike News | తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ, దసరా సందర్భంగా రెగ్యూలర్ ఆర్టీసీ సర్వీసులలో బస్సు ఛార్జీలు పెంచలేదని ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు.
TGSRTC ticket fares not hiked during Dasara festival says MD Sajjanar | హైదరాబాద్: బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ విపరీతంగా టికెట్ ధరలు పెంచిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. జీవో ప్రకారం స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీలను సంస్థ సవరించినట్లు చెప్పారు. అంతేకానీ రెగ్యులర్ సర్వీస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని ఓ ప్రకటన విడుదల చేశారు.
సజ్జనార్ విడుదల చేసిన ప్రకటనలో వివరాలు ఇవే..
‘తెలుగువారి ముఖ్య పండుగులైన సంక్రాంతి, దసరా (Dasara), రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, ఉగాది (Ugadi), లాంటి సమయాల్లో హైదరాబాద్ నుంచి ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్తుంటారు. ఈ సమయంలో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు లేకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం (TGSRTC) నడుపుతుంది. హైదరాబాద్ సిటీ బస్సులను కూడా జిల్లాలకు తిప్పుతూ సేవలు అందించాం. తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ ఉండకపోవడంతో ఆ బస్సులు ఖాళీగా వెళ్తుంటాయి. ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరను (RTC Ticket Price) సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. అందుకే పండుగల సమయాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే 1.50 వరకు టికెట్ ధరను సవరించుకునే వెసులుబాటు ఆర్టీసీకి ఇచ్చారు.
ఆర్టీసీలో పెరిగిన రద్దీ
మహాలక్ష్మి పథకం అమలు అనంతరం రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం మేర రద్దీ పెరిగింది. గతంతో పోల్చితే సంక్రాంతి (Pongal), రాఖీ పౌర్ణమి, తదితర పండుగలకు బస్సుల్లో ప్రయాణాలు పెరుగుతాయి. ఆయా సమయాల్లో ఒకవైపే రద్దీ ఎక్కువగా ఉంటోంది. తిరుగు ప్రయాణంలో చాలా బస్సులు ఖాళీగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా పండుగుల్లో నడిచే స్పెషల్ బస్సులకు చార్జీలను జీవో ప్రకారం సవరించారు. టీజీఎస్ఆర్టీసీ (TGSRTC)లో ప్రస్తుతం 9000 కు పైగా బస్సులు సేవలందిస్తున్నాయి. పండుగ సమయాల్లో రద్దీకి అనుగుణంగా ప్రతి రోజు సగటున 500 స్పెషల్ బస్సులను RTC నడుపుతుంది. ఆ 500 స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీలు సవరించాం. మిగతా 8500 రెగ్యులర్ సర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు.
పండుగ సమయాల్లో బస్సు ఛార్జీల్లో మార్పులకు గతంలోనే జీవో
పండుగ సమయాల్లో రెగ్యులర్ , స్పెషల్ సర్వీసుల్లో టికెట్ ధరల్లో వ్యత్యాసం సాధారణం. ఉదాహరణకు ఒక ప్రయాణికుడు వెళ్లేటప్పుడు రెగ్యులర్ సర్వీసుల్లో ప్రయాణిస్తే సాధారణ టికెట్ ధరనే ఉంటుంది. తిరుగు ప్రయాణంలో స్పెషల్ బస్సు (RTC Special Bus)ను వినియోగించుకుంటే జీవో ప్రకారం మారిన చార్జీలుంటాయి. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డులను సంస్థ ఏర్పాటు చేస్తుంది. అలాగే, ఆర్టీసీ సిబ్బంది కూడా స్పెషల్ బస్సుల్లో సవరించిన చార్జీలను టికెట్ జారీ సమయంలో ప్రయాణికుడికి తెలియజేస్తారు. పండగ రోజుల్లో మాత్రమే జీవో ప్రకారం స్పెషల్ సర్వీసుల్లో టికెట్ ధరలను సవరించడం జరుగుతుందని యాజమాన్యం మరోసారి స్పష్టం చేస్తుంది. సాధారణ రోజుల్లో యథావిధిగా సాధారణ టికెట్ ధరలే ఉంటాయని, స్పెషల్ సర్వీసులకు టికెట్ ధరలను సవరించడం సంస్థలో అనవాయితీగా వస్తోందని సజ్జనార్ వెల్లడించారు.
Also Read: KTR News: ప్రొఫెసర్ సాయిబాబాకు నివాళులు అర్పించేందుకు వెళ్లిన కేటీఆర్‌కు చేదు అనుభవం