KTR News: ప్రొఫెసర్ సాయిబాబాకు నివాళులు అర్పించేందుకు వెళ్లిన కేటీఆర్‌కు చేదు అనుభవం
Professor Saibaba News | ఇటీవల కన్నుమూసిన ప్రొఫెసర్ సాయిబాబా భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు వెళ్లిన మాజీ మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. కేటీఆర్ గోబ్యాక్ అని నినాదాలు చేశారు.
KTR Pays Tribute to Professor Saibaba at Moulali | హైదరాబాద్: ప్రొఫెసర్ సాయిబాబా పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. గన్ పార్కులోని అమరవీరులస్థూపం వద్ద నుంచి సాయిబాబా భౌతికకాయాన్ని మౌలాలిలోని ఆయన నివాసానికి తరలించారు. ఈ క్రమంలో సాయిబాబాకు నివాళులు అర్పించేందుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మౌలాలిలోని ప్రొఫెసర్ నివాసానికి సోమవారం వెళ్లగా చేదు అనుభవం ఎదురైంది. అక్కడ ఉన్న ఉద్యమకారులు, పౌర హక్కుల నేతల నుంచి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. KTR గో బ్యాక్, KTR గో బ్యాక్ అంటూ నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ఉపా కేసులతో ఉద్యమ కారులను జైలుకు పంపారని ఆరోపించారు. ఉద్యకారులపై ఉక్కుపాదం మోపింది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ప్రొఫెసర్ కోదండరాం, విమలక్కపై, హరగోపాల్ లాంటి నేతలపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసింది ఎలా మరిచిపోతాం అని ఉద్యమకారులు, పౌర హక్కుల సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ప్రొఫెసర్ సాయిబాబా భౌతికకాయానికి నివాళులు అర్పించి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
💥ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా భౌతికకాయానికి నివాళులర్పించడానికి వచ్చిన
— మీ కాపలా కుక్క (@mekaapalaKukka) October 14, 2024
కేటీఆర్ కి నిరసన సెగ !
💥 'గో బ్యాక్ కేటీఆర్' అంటూ సాయిబాబా అభిమానులు, కామ్రేడ్లు నినాదాలు చేశారు.
💥పదేళ్లుగా సాయిబాబా జైల్లో ఉన్నప్పుడు BRS ఏం చేసిందని నిలదీశారు.
💥అక్కడి నుండి… pic.twitter.com/WjNfSS9juc
గన్‌పార్క్ వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్తత
అంతకుముందు గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రొఫెసర్ సాయిబాబా పార్థివదేహాన్ని అక్కడ కాసేపు ఉంచి నివాళులు అర్పించాలని చూడగా అందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. సీపీఐ నేత నారాయణ, వామపక్ష నేతలు ప్రొఫెసర్ సాయిబాబా భౌతికకాయానికి నివాళులర్పించారు. పెద్ద ఎత్తున అభిమానులు గన్ పార్క్ కు తరలివచ్చి కామ్రేడ్ సాయిబాబా అమర్‌రహే, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అక్కడ ఓ అయిదు నిమిషాలు సంతాప సమావేశానికి కుటుంబసభ్యులు, అభిమానులు పర్మిషన్ కోరగా శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని అందుకు పోలీసులు నిరాకరించారు. అంబులెన్స్‌లోనే ప్రొఫెసర్ సాయిబాబా భౌతికకాయానికి పలువురు నివాళులు అర్పించారు. మరోవైపు పర్మిషన్ లభించకపోవడంతో సాయిబాబా అభిమానులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగి, గన్ పార్క్ వద్ద కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. . అనంతరం ప్రొఫెసర్ సాయిబాబా భౌతికకాయాన్ని మౌలాలికి తరలించారు.
సమాజాన్ని చదివేవారు మేధావులు అని, ప్రొఫెసర్ సాయిబాబా అలాంటి వ్యక్తి అని గన్‌పార్కు వద్ద సీపీఐ నేత నారాయణ కొనియాడారు. అంగవైకల్యం ఉన్న మేధావి సాయిబాబాను అన్యాయంగా 10 సంవత్సరాలు జైల్లో నిర్బంధించారని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు దోషులు ఎవరో తేల్చాలని సుప్రీంకోర్టుకు లేఖ రాస్తామని చెప్పారు.
హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సాయిబాబా: హరీష్ రావు
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రొఫెసర్ సాయిబాబాకు నివాళులర్పించారు. మౌలాలిలోని ఆయన నివాసానికి వెళ్లి ప్రొఫెసర్ సాయిబాబా భౌతికకాయానికి హరీష్ రావు, ప్రొఫెసర్ కోదందరామ్, పలువురు బీఆర్ఎస్ నేతలు ఘనంగా నివాళి అర్పించారు. సమాజంలో మార్పు రావాలని, హక్కుల కోసం పోరాడిన సాయిబాబా జైలు నుంచి విడుదలైన కొంత కాలానికే చనిపోవడం బాధాకరం అన్నారు. హక్కుల కోసం పోరాడేవారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం దుర్మార్గమని పేర్కొన్నారు. ప్రొఫెసర్ సాయిబాబా మృతికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆయనపై కేంద్రం అణచివేత ధోరణితో వ్యవహరించిందని తెలిపారు. హక్కుల కోసం పోరాడిన వ్యక్తిని జైల్లో పెట్టారని, ఆ సమయంలో ప్రజాస్వామ్యవాదులు సాయిబాబా నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించారని కోదండరాం గుర్తుచేశారు.