Kurnool Bus Accident Effect: కర్నూలు ఘటనతో అలర్ట్.. ప్రయాణికులకు సేఫ్టీ ప్రికాషన్స్ ఏర్పాటు చేసిన TGSRTC
Telangana RTC Buses | ఇటీవల జరిగిన కర్నూలు బస్సు ప్రమాదంతో తెలంగాణ ఆర్టీసీ అప్రమత్తమైంది. బస్సుల్లో సేఫ్టీ ప్రికాషన్స్ ఏర్పాటు చేసింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తమ ప్రయాణికుల క్షేమమే ధ్యేయంగా వివిధ రకాల బస్సులలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన ప్రైవేటు వి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం (ఇందులో బస్సులో మంటలు చెలరేగి 19 మంది సజీవ దహనమయ్యారు) వంటి దుర్ఘటనల నేపథ్యంలో టీజీఎస్‌ఆర్టీసీ తమ బస్సుల్లో ఏర్పాటుచేసిన సేఫ్టీ ఫీచర్లను ప్రజలకు వివరిస్తోంది. టీజీఎస్‌ఆర్టీసీ వివిధ రకాల బస్సులలో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేస్తూ, ప్రమాదాలు సంభవించినప్పుడు నష్టాన్ని తగ్గించేందుకు కట్టుబడి ఉంది.
బస్సుల్లో అత్యవసర భద్రతా పరికరాలు
టీజీఎస్‌ఆర్టీసీ బస్సులు అన్ని రకాల అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ఆధునిక భద్రతా పరికరాలను అమర్చింది. ముఖ్యంగా, లహరి ఏసీ స్లీపర్, లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ బస్సులలో పటిష్టమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఈ బస్సులలో వెనుక భాగంలో అత్యవసర ద్వారం (Emergency Exit) ఏర్పాటు చేశారు. అద్దాలు పగులగొట్టేందుకు సుత్తెలు (Hammers) అందుబాటులో ఉంచారు. అగ్ని ప్రమాదాల నివారణకు గాను ఫైర్ ఎక్స్‌టింగిషెర్ (Fire Extinguishers) పరికరాలు ఉన్నాయి. వీటికి అదనంగా ఈ బస్సుల డ్రైవర్ క్యాబిన్ నందు మంటలను వెంటనే గుర్తించి ఆర్పేందుకు ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ పరికరము (Automatic Fire Detection and Suppression System) అమర్చారు. ప్రయాణికులను తక్షణమే అప్రమత్తం చేయుటకు సైరన్ కూడా ఏర్పాటు చేశారు.
ఇతర బస్సులలో భద్రత
సూపర్ లగ్జరీ బస్సులలో ఫైర్ ఎక్స్‌టింగిషెర్ పరికరాలతో పాటు, బస్సు వెనుక భాగంలో కుడి వైపున అత్యవసర ద్వారం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సులలో కూడా కుడి వైపు వెనుక భాగంలో అత్యవసర ద్వారం, ఫైర్ ఎక్స్‌టింగిషెర్‌లు ఏర్పాటు చేసినట్లు టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది. ప్రయాణికులందరూ ఈ భద్రతా అంశాలను గమనించి, ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ కోరుతోంది.
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ వారి ముఖ్య గమనిక..
— TGSRTC (@TGSRTCHQ) October 26, 2025
టి.జి.ఎస్.ఆర్టీసీ వివిధ రకాల బస్సులలో ప్రయాణికులను తమ యొక్క గమ్యస్థానాలకు చేరవేస్తూ ఉన్నది.. ప్రయాణికుల క్షేమమే ధ్యేయంగా వివిధ రకాల బస్సులలో సేఫ్టీ ప్రీకాషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది లహరి ఏ.సీ స్లీపర్ మరియు లహరి ఏ.సీ స్లీపర్ కం…
చివరగా మీ ఆదరణ మాకు కొండంత అండా.. అని తెలియజేస్తూ, ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖప్రదం అని టీజీఎస్‌ఆర్టీసీ తమ ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలియజేసింది. ఆర్టీసీలో సురక్షితంగా గమ్యస్థానాలు చేరాలని, ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగినా ప్రాణనష్టం జరగకుండా విపత్తు నుంచి బయటపడేలా ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ తమ ప్రయాణికులకు స్పష్టం చేసింది.






















