TG New Ration Cards: మీకు రేషన్ కార్డు లేదా? తెలంగాణ ప్రభుత్వం కొత్త కార్డుల జారీ చేసేది ఎప్పుడంటే..
Telangana New ration cards | తెలంగాణలో రేషన్ కార్డులకు దరఖాస్తులు మీసేవా కేంద్రాల్లో స్వీకరిస్తున్నారు. గతంలో కార్డు ఉన్న వారు పాత దాంట్లో తమ పేరు తొలగించుకోవాలని అధికారులు సూచించారు.

New Ration Cards In Telangana | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక టీఆర్ఎస్, బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది జనవరి 26న తొలిసారి రేషన్ కార్డులు జారీ చేసింది. కొందరికి రేషన్ కార్డులు రాకపోవడం, పాత కార్డుల్లో మార్పులు చేయలేకపోవడంతో ఎన్నో ప్రయోజనాలు సైతం కోల్పోతున్నారు. దాంతో ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తులు, గత నెలలో నిర్వహించిన గ్రామ సభలలో సేకరించిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. అర్హులైన వారి జాబితా సిద్ధం చేసి ఆన్‌లైన్ లో లబ్ధిదారుల కోసం వివరాలు అందుబాటులో ఉంచుతున్నారు.
అలా చేయకపోతే కొత్త అప్లికేషన్ రిజెక్ట్
2023 డిసెంబర్ 26 నుంచి జనవరి 6వ తేదీ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహించింది. ఇందులో భాగంగా గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం, రైతు భరోసా, గృహజ్యోతి, మహాలక్ష్మి, సబ్సిడీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ సహా గ్యారంటీ పథకాలకు, కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించారు. గత నెలలో లబ్దిదారుల జాబితా విడుదల చేయగా.. కొందరికి కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు. పాతవి లేకపోవడంతో మీసేవ కేంద్రాల(Mee Seva Centres)కు క్యూ కడుతున్నారు. అయితే పాత రేషన్ కార్డులలో పేర్లు ఉన్నవారు మొదట అందులో తమ పేరు తొలగించుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచించారు. లేకపోతే కొత్త రేషన్ కార్డు కోసం చేసుకున్న అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందని వెల్లడించారు.
మరోవైపు పదేపదే దరఖాస్తులు ఇవ్వకూడదని గ్రామసభల్లో, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి సూచించారు. లేకపోతే దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరగడంతో పాటు రిపీట్ డేటా ఉంటే ఓవరాల్ గా రెండు అప్లికేషన్లు పక్కన పెట్టే అవకాశాలు సైతం ఉన్నాయి. ఇప్పటివరకూ దరఖాస్తు చేసుకోనివారు మాత్రమే అప్లై చేసుకోవాలని, లేక లబ్దిదారుల జాబితాలో పేరు లేదని నిర్ధారించుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పుడంటే..
తెలంగాణలో ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఫిబ్రవరి 27న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉంది. మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ స్థానానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంగనర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనున్నాయి. మార్చి మొదటి వారంలో వీటి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల ప్రక్రియ ముగియగానే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై ఫోకస్ చేయనుంది. దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి, లబ్ధిదారుల జాబితాను డేటా ఎంట్రీ చేయనున్నారు. కార్డు ఉండి మళ్లీ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.
8 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు
తెలంగాణ వ్యాప్తంగా 8 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 84 వేల వరకు దరఖాస్తులు రాగా, పరిశీలించి వాటిలో 75 వేల మందిని అర్హులుగా గుర్తించారు. జిల్లాల్లోనూ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు పరిశీలన జరుగుతోంది. జనవరి 26న మండలానికి ఓ గ్రామాన్ని ఎంపిక చేసి కొత్త రేషన్ కార్డులను జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజలకు సూచించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

