TS Rains : తెలంగాణను కమ్మేసిన వరుణుడు, మరో మూడు రోజుల పాటు జోరుగా వానలు
TS Rains : నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
TS Rains : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కూడా వర్షాలు భారీగా కురుస్తుండడంతో వరద పొటెత్తుతోంది. దీంతో తెలంగాణకు భారీగా వరద నీరు వస్తుంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణలోని యాదాద్రి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, సూర్యాపేట, జనగాం, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఈ జిల్లా వర్షాలు కురుస్తున్నాయి.
సోంపల్లి వాగులో చిక్కుకున్న రైతు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల తాలిపేరు ప్రాజెక్టుకు వరదనీరు భారీగా చేరుతోంది. 20 గేట్లు అడుగు మేర ఎత్తివేసి 11912 కూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు. అయితే డ్యామ్ సామర్థ్యం 74 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 69.62 మీటర్లకు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో కిన్నెరసాని గేట్లు తెరవడంతో సోంపల్లి వాగులో దంతెలబారుకు చెందిన రైతు చిక్కుకున్నాడు. రైతును కాపాడేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. సాయం కోసం రైతు ఎదురుచూస్తున్నాడు.
కాలనీలు జలమయం
సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో 19.4, ఖమ్మం జిల్లా ఖానాపూర్‌లో 16.2, భద్రాద్రి జిల్లా సీతారాంపట్నంలో 10.9 సెంటిమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇతర జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు కాలనీల్లో చేరింది. రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. పట్టణాల్లోని పలు కాలనీలు వరద ముంపునకు గురయ్యాయి.
ఉప్పొంగుతున్న నదులు
మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ఇంద్రావతి, ప్రాణహిత, గోదావరి నదుల్లో భారీగా వరదనీరు చేరుతోంది. వాగులు, వంకలు నిండి పలు చోట్ల రోడ్లు తెగిపోయాయి. మారుమూల గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. వరద నీటితో రామగుండం, ఇల్లందు ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఇల్లందు కోయగూడెం ఉపరితల గనిలో క్యాంపు కార్మికుల నివాస సముదాయాలు నీటిలో మునిగాయి. వర్ష ప్రభావం తగ్గితే గానీ తిరిగి బొగ్గు ఉత్పత్తి పనులు చేయడానికి లేదని అధికారులు తెలిపారు.
రోడ్లపైకి చేపలు
ఖమ్మం జిల్లా వైరాలో చేపలు రోడ్లపైకి వచ్చాయి. వాటిని పట్టుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. గత రెండు రోజులుగా ఖమ్మం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి భారీ వర్షం కురవడంతో డ్రైనేజీలలోకి చేపలు చేరాయి. వైరా రిజర్వాయర్‌కు అనుసంధానంగా ఈ డ్రైనేజీలు ఉండటంతో చెరువులో చేపలు డ్రైనేజీల ద్వారా బయటకు వచ్చాయని మత్స్య కారులు చెబుతున్నారు. వైరాలోని శివాలయం ప్రాంతంలో రోడ్లపైకి చేపలు రావడంతో వాటిని పట్టుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు.