Telangana Politics: ఆ మూడు స్థానాలు ఇస్తే కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధమంటున్న సీపీఐ
Telangana Politics: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బెల్లంపల్లి, హుస్నాబాద్, కొత్తగూడెం స్థానాల్లో తమ అభ్యర్థులకు సీటు ఇస్తే.. కాంగ్రెస్ తో పొత్తుకు తాము సిద్ధమేనని సీపీఐ ప్రకటించింది.
Telangana Politics: రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ముఖ్యంగా పొత్తుల కోసం ఎత్తులు వేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ ఠాక్రే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో చర్చలు జరపగా.. ఓ మూడు స్థానాల్లో తమకు ఛాన్స్ ఇస్తే పార్టీతో పొత్తుకు సిద్ధమని అన్నారు. బెల్లంపల్లి, హుస్నాబాద్, కొత్తగూడెం, మునుగోడు స్థానాలను ఆయన కోరినట్లు సమాచారం. ఇందులో మూడు స్థానాలను తమ అభ్యర్థులకు ఇస్తే హస్తం పార్టీతో పొత్తుకు సిద్ధమని సాంబశివరావు చెప్పినట్లు సమాచారం.
మరోవైపు సీపీఎం కార్యాలంలో రాష్ట్ర కార్యవర్గం ఇవాళ సమావేశం అయింది. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవి. రాఘవులు ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సాయంత్రం వరకు ఈ కార్యవర్గ సమావేశం కొనసాగింది. బీఆర్ఎస్ తో పొత్తు తెగదింపుల నేపథ్యంలో.. సీపీఐతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటికే సీపీఎం నిర్ణయం తీసుకుంది. పొత్తులు, సీట్ల సర్దుబాటు సహా వివిధ అంశాలపై కార్యవర్గ సమావేశంలో నేతలు చర్చించారు.
మరోవైపు కేసీఆర్ కే ఓటేస్తామని 9 పంచాయతీల్లో తీర్మానం
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓట్లన్నీ సీఎం కేసీఆర్‌కే వేస్తామని కామారెడ్డి జిల్లాలో 9 పంచాయతీల్లో నేతలు ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. రాబోయే ఎన్నికల్లో గజ్వేల్ తోపాటు.. కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమ పంచాయతీ పరిధిలోని ప్రజలు మొత్తం కేసీఆర్‌కు ఓటు వేస్తామని మాచారెడ్డి మండలంలోని 8, పాల్వంచ మండలంలో ఓ పంచాయతీ పాలక వర్గం తీర్మానం చేశాయి. ఎంపీపీ లోయపల్లి నర్సింగ్‌రావు, జెడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి ఆధ్వర్యంలో మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట, అంకిరెడ్డి పల్లి తండా, వెనుకతండా, నడిమి తండా, నెమ్లిగుట్ట తండా, బొడిగుట్ట తండా, మైసమ్మ చెరువు తండా, రాజ్‌ఖాన్‌పేట, పాల్వంచ మండలంలోని మంథని దేవుని పల్లి పంచాయతీ కేసీఆర్‌కు ఏకగ్రవంగా ఓటు వేసేలా తీర్మానాలు చేశాయి.
నేతల తీర్మానంపై కాంగ్రెస్ ఆగ్రహం
9 పంచాయతీల్లో కేసీఆర్‌కు ఓటు వేస్తామని బీఆర్ఎస్ నేతలు తీర్మాణం చేయడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ చేసే తీర్మానాన్ని ప్రజా తీర్మానంగా ఎలా చూపుతారని కాంగ్రెస్ మాచారెడ్డి మండల అధ్యక్షుడు గణేశ్ నాయక్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన పార్టీలతో వారు ముందుకెళ్తారన్నారు. బీఆర్‌ఎస్ చేసిన తీర్మానాలకు ఎటువంటి విలువ లేదన్నారు. గ్రామం మొత్తం బీఆర్‌ఎస్‌కు ఏకగ్రీవంగా మద్దతు ఇస్తోందని తీర్మానించడం కరెక్ట్ కాదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేస్తూ, భూములను అమ్మకుంటున్న బీఆర్‌ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఓడిపోతారనే భయంతోనే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీచేస్తున్నారని విమర్శించారు.