Telangana Covid-19: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం... 42 మంది విద్యార్థులకు పాజిటివ్...
గురుకుల పాఠశాలల్లో కరోనా కలకలం రేగుతుంది. ముత్తంగి గురుకుల పాఠశాలలో 43 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణలో కరోనా భయాలు ఇంకా వీడలేదు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ తర్వాత పాఠశాలలు తెరుచుకున్నాయి. ఇటీవల వరుసగా విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణలోని పలు పాఠశాలల్లో కరోనా కేసులు నమోదవ్వడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెర్వు మండలం ముత్తంగిలో కరోనా కలకలం రేగింది. ముత్తంగి గురుకుల పాఠశాలలో 42 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కోవిడ్ బారినపడ్డారు. గురుకుల పాఠశాలలో మొత్తం 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. ఆదివారం 261 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో మొత్తం 43 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. మిగతా విద్యార్థులకు సోమవారం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: విపత్తు నిర్వహణలో బాగా పని చేశారు.. సీఎం జగన్‌కు కేంద్ర బృందం అభినందన !
వసతి గృహంలోనే క్వారంటైన్
కరోనా వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయురాలి నమూనాలను జీనోమ్ స్వీక్వెన్సింగ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. కరోనా సోకిన విద్యార్థులను వసతి గృహంలోనే క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు. మూడు రోజుల క్రితం ఓ విద్యార్థిని అస్వస్థతకు గురి కావడంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో కరోనా కేసులు బయటపడ్డాయి. కరోనా సోకిన విద్యార్థుల పరిస్థితి బాగానే ఉందని అధికారులు పేర్కొన్నారు. ముత్తంగి గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థులకు కరోనా సోకడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
కోవిడ్ నిబంధనలు పాటించండి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రాష్ట్రంలో విద్యాసంస్థల్లో కోవిడ్ కేసులు నమోదు అవుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యార్థులందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల్లో కోవిడ్ కేసులు వెలుగుచూడటంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించేలా చూడాలని పాఠశాలల యాజమాన్యాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పాఠశాలల సిబ్బంది తప్పనిసరిగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలని ఆదేశించారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి