KTR Questions BJP: 8 ఏళ్లలో ఎన్ని దాడులు చేశారు, ప్రశ్నిస్తూనే కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ సెటైర్
Telangana IT Minister KTR Tweet: కేంద్ర ప్రభుత్వం ఏ మేర పారదర్శకంగా వ్యవహరిస్తుందో, పక్షపాత ధోరణి లేకుండా పాలన సాగిస్తుందో తెలుసుకునేందుకు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో ప్రశ్నించారు.
Telangana IT Minister KTR: కేంద్ర ప్రభుత్వ విధానాలు, కేంద్రంలోని బీజేపీ పాలనపై తరచుగా విమర్శలు చేస్తున్నారు తెలంగాణ అధికార పార్టీ నేతలు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏ మేర పారదర్శకంగా వ్యవహరిస్తుందో, పక్షపాత ధోరణి లేకుండా పాలన సాగిస్తుందో తెలుసుకునేందుకు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో ప్రశ్నించారు. గడిచిన 8 ఏళ్లలో ఎంత మంది బీజేపీ నేతలు, వారి సన్నిహితులు, సంబంధించిన వారిపై ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు నిర్వహించారో చెప్పాలని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. బీజేపీలో ఉన్న వారంతా సత్య హరిశ్చంద్రునికి సంబంధీకులా అని సెటైర్ పేల్చారు.
శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు హక్కుగా రావాల్సినవి ఇవ్వకుండా రాష్ట్ర అభివృద్ధికి సహకరించకపోయినా, కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నామని కేటీఆర్ అన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమి ఇచ్చారో ప్రజల ముందు శ్వేతపత్రం పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. మరోవైపు సీఎం కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పేందుకు సరికొత్త జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా పావులు కదుపుతున్నారు. ధాన్యం కొనుగోలు అంశం, రాష్ట్రానికి నిధులు, ఐఐటీలు, ఎఐఎంలు, ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు లాంటి తెలంగాణకు ఏం ఇచ్చారో చెప్పాలంటూ తనకు వీలు చిక్కినప్పుడల్లా కేంద్రంలోని బీజేపీ పెద్దలు, ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తూనే ఉంటారు.
How many ED, IT & CBI raids on BJP leaders or their kith & kin in last 8 years?
— KTR (@KTRTRS) June 11, 2022
Kya Sab Ke Sab BJP waale Satya Harischandra Ke rishthedaar hain? #JustAsking
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో పాటు బీజేపీ, కేంద్రం పెద్దలు తెలంగాణ పర్యటన నేపథ్యంలో వారిపై మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణకు ఏ నిధులు ఇచ్చారో చెప్పాలని, విద్యా సంస్థలు, నిధుల పంపకంలో సైతం కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, కేంద్రానికి తగిన రీతిలో బదులిస్తామని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికంగా ఎదుగుతున్న తెలంగాణ కేంద్రం మద్దతు, నిధులు అంతగా రాకున్నా ఎన్నో రంగాల్లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్నట్లు పలు సందర్బాలలో ప్రస్తావించారు.
Also Read: Minister KTR : మంత్రి కేటీఆర్ కు చెరకు రైతుల నిరసన సెగ, కాన్వాయ్ పై చెప్పుతో దాడికి యత్నం!