Team India: రోహిత్, కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌పై టీమిండియా మాజీ క్రికెటర్, వరల్డ్ కప్ విజేత కీలక వ్యాఖ్యలు..
Virat Kohli | విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ రిటైర్మెంట్ సహజంగా లేదని భారత మాజీ క్రికెటర్, టీ20 వరల్డ్ కప్ విజేత రాబిన్ ఉతప్ప అభిప్రాయపడ్డాడు. దాంతో వీరి టెస్ట్ వీడ్కోలుపై మళ్లీ చర్చ జరుగుతోంది.

భారత క్రికెట్ లోని ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుండి ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించడంపై మరోసారి చర్చ మొదలైంది. ఈసారి ఈ విషయాన్ని మాజీ భారత ఓపెనర్, టీ20 వరల్డ్ కప్ విజేత రాబిన్ ఉతప్ప ప్రస్తావించారు. ఈ ఇద్దరు దిగ్గజాలు టెస్ట్ క్రికెట్ నుండి వైదొలగిన టైం, విధానంపై ఉతప్ప పలు ప్రశ్నలు లేవనెత్తారు.
టెస్ట్ రిటైర్మెంట్‌పై మళ్ళీ ప్రశ్నలు
ఈ ఏడాది ప్రారంభంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ నిరాశాజనక ప్రదర్శన ఎదుర్కొన్న తరువాత, ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కోహ్లీ, రోహిత్ తమ నిర్ణయం వెల్లడించారు. అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన సొంత సిరీస్‌లో ఓటమి, ఆపై ఆస్ట్రేలియా పర్యటనలోనూ దిగ్గజ బ్యాటర్లపై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది.
ఆస్ట్రేలియా పర్యటన తర్వాత ఇద్దరు ఆటగాళ్లను రంజీ ట్రోఫీ ఆడాలని బీసీసీఐ సూచించింది. వారు కూడా అందులో పాల్గొన్నారు. అయినప్పటికీ, ఐపీఎల్ సమయంలో రోహిత్ శర్మ ఆకస్మికంగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కొద్ది రోజుల తర్వాత విరాట్ కోహ్లీ సైతం సోషల్ మీడియాలో తన టెస్ట్ కెరీర్‌కు విరామం ప్రకటించారు. ఇవన్నీ ఇంగ్లాండ్ పర్యటనకు కొన్ని రోజుల ముందు జరగడంతో అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు ఆశ్చర్యపోయారు.
వారి రిటైర్మెంట్ సహజంగా అనిపించలేదు
తన యూట్యూబ్ ఛానెల్‌లో రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ.. ఈ ఇద్దరి రిటైర్మెంట్ అంత సహజంగా అనిపించలేదని అన్నారు. రోహిత్, కోహ్లీ ఈ నిర్ణయం బలవంతంగా తీసుకున్నారని చెప్పడం లేదు, కానీ అది జరిగిన తీరు, సమయం వారు సొంతంగా, ఇష్టపడి వీడ్కోలు పలికినట్లు అనిపించలేదు. అసలు నిజం ఏమిటో విరాట్, రోహిత్ మాత్రమే చెప్పగలరని ఉతప్ప అన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మ ఫామ్ బాగా లేదని, అయితే కొద్దికాలం విరామం తీసుకుని ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి తిరిగి వస్తాడని తాను భావించానని మాజీ సహచరుడు ఉతప్ప అన్నారు. 2007 టీ20 వరల్డ్ కప్ జట్టులో వీరిద్దరూ ఉన్నారని తెలిసిందే.
వన్డేలో
టెస్ట్ నుండి రిటైర్మెంట్ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కేవలం వన్డేలపైనే దృష్టి సారిస్తున్నారు. ఇటీవల ఇద్దరూ విజయ్ హజారే ట్రోఫీలో తిరిగి వచ్చి అద్భుతమైన ప్రదర్శన చేశారు. "విరాట్, రోహిత్ ఇద్దరి కళ్ళలో మళ్ళీ అదే కసి కనిపిస్తోంది. ఇంత పెద్ద కెరీర్ తర్వాత కూడా వారిలో ఆటపట్ల అంత అభిరుచిని చూడటం చాలా బాగుంది" అన్నాడు ఉతప్ప.
2027 వరల్డ్ కప్‌పై దృష్టి
ఇప్పుడు ఇద్దరు దిగ్గజాలు 2027 వన్డే వరల్డ్ కప్‌పై ఫోకస్ చేశారు. టెస్ట్ క్రికెట్ నుండి వీడ్కోలుపై ప్రశ్నలు తలెత్తుతున్నప్పటికీ, వన్డే ఫామ్‌ను చూస్తే విరాట్, రోహిత్ శర్మ కెరీర్ ఇంకా ముగిసిపోలేదని స్పష్టమవుతోంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో వీరు పరుగులు రాబట్టి కుర్రాళ్లకు పోటీ ఇచ్చారు. భారత క్రికెట్‌లో వారి అనుభవం, క్లాస్ రాబోయే సంవత్సరాల్లో, వన్డే వరల్డ్ కప్‌లో కీలక పాత్ర పోషించగలదు.





















