US Immigration Policy: అమెరికాలో కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్.. బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్న ట్రంప్
America immigration policy | అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్లు, విదేశీయులకు కొత్త ఇమిగ్రేషన్ నిబంధనలు. ప్రవేశం, నిష్క్రమణ రెండింటికీ బయోమెట్రిక్ తప్పనిసరి. ఎక్కువ కాలం విదేశాల్లో ఉంటే గ్రీన్ కార్డ్ ప్రమాదంలో పడవచ్చు.

అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గ్రీన్ కార్డ్ హోల్డర్లకు, అంటే అమెరికాలో శాశ్వత నివాసం ఉన్నవారికి.. అలాగే గ్రీన్ కార్డ్ లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారికి కఠినమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలను అమలు చేసింది. ఈ నిబంధనల వల్ల అమెరికాలో నివసిస్తున్న పౌరులు కానివారి కష్టాలు పెరగనున్నాయి. అమెరికా పౌరసత్వం లేని వారిపై దీని ప్రభావం నేరుగా పడుతుంది.
అమెరికా ప్రభుత్వం ప్రకారం ఈ కొత్త నిబంధనల ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే.. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం. అదే విధంగా అక్రమ చొరబాట్లను అరికట్టడం. మీరు కూడా అమెరికాలో నివసిస్తూ, అమెరికా పౌరసత్వం లేనివారైతే ఈ నిబంధనల గురించి తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం. అమెరికాలో శాశ్వత నివాసం ఉంటున్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు సైతం ట్రంప్ నిర్ణయాలతో తలనొప్పులు తప్పడం లేదు.
డిసెంబర్ 26, 2025 నుండి అమలు
అమెరికా ప్రభుత్వం ఈ కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలను దేశవ్యాప్తంగా డిసెంబర్ 26, 2025 నుంచి అమలు చేసింది. ఈ నిబంధనల ప్రకారం అమెరికా పౌరసత్వం లేని వారు, గ్రీన్ కార్డ్ హోల్డర్లతో సహా ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. కొత్త నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి అమెరికా నుండి బయటకు వెళ్లి తిరిగి దేశంలోకి ప్రవేశిస్తే, అతను బయోమెట్రిక్ వ్యవస్థ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. అంటే, అమెరికాలో నివసిస్తున్న పౌరులు కాని వారందరి గుర్తింపు ఇకనుంచి డిజిటల్ పద్ధతిలో జరుగుతుంది. ఇందులో వేలిముద్రలు, ఫోటోలు ఉంటాయి.
పిల్లలు, వృద్ధులకు మినహాయింపు రద్దు
గతంలో అమెరికాలో 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, వృద్ధులకు బయోమెట్రిక్ ప్రక్రియ నుండి మినహాయింపు ఉండేది. దేశంలోకి ప్రవేశించేటప్పుడు లేదా బయటకు వెళ్ళేటప్పుడు వారికి వేలిముద్రలు ఇవ్వడం, ఫోటో తీయించుకోవడం అవసరం లేదు. కానీ కొత్త నిబంధనల అమలులోకి వచ్చాక ఈ మినహాయింపు రద్దు చేశారు. ఇప్పుడు ప్రతి వయస్సు వారు బయోమెట్రిక్ ప్రక్రియ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది.
ఇప్పుడు ప్రవేశం, నిష్క్రమణ రెండింటిలోనూ తనిఖీ
కొత్త నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ, ఇప్పుడు ఏ వ్యక్తి అయినా అమెరికాలోకి ప్రవేశించినా.. దేశం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు రెండు సందర్భాలలోనూ బయోమెట్రిక్ విధానం ద్వారా మాత్రమే వెళ్లే వీలుంటుంది. గతంలో ఈ నిబంధన దేశంలోకి ప్రవేశించేటప్పుడు మాత్రమే వర్తించేది. ఎవరు ఎంతకాలం అమెరికాలో ఉన్నారు. ఎప్పుడు దేశం నుండి బయటకు వెళ్లారనే విషయాలను తెలుసుకోవడం దీని ఉద్దేశ్యం. దాంతోపాటు అక్రమ చొరబాట్లు, గడువు ముగిసినా అమెరికాలో ఉండే వీలు లేకుండా పోతుంది.
ఎక్కువ కాలం బయట ఉంటే గ్రీన్ కార్డ్‌కు ప్రమాదం
ఒకవేళ గ్రీన్ కార్డ్ హోల్డర్ ఒక సంవత్సరం కంటే ఎక్కువ రోజు అమెరికా బయట ఉంటే, వారి గ్రీన్ కార్డ్ స్టేటస్‌కు ముప్పు పొంచి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పుడు అధికారులు వ్యక్తి ప్రయాణ రికార్డులను కూడా పరిశీలిస్తారు. అంటే వారు ఎన్నిసార్లు అమెరికా నుండి బయటకు వెళ్లారు. ఎప్పుడు దేశంలోకి తిరిగి వచ్చారనేది చూస్తారు. కొత్త రూల్స్ ప్రకారం, ఒక వ్యక్తికి అమెరికాకు పరిమిత కాల వ్యవధి వీసా లభించి, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో నివసిస్తే, డిజిటల్ వ్యవస్థ ద్వారా వెంటనే అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకుంటారు.






















