Old Age Pensions: కొత్త వృద్ధాప్య పింఛన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్... 57 ఏళ్ల వయసు నిండిన వారు అర్హులు... ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
తెలంగాణలో కొత్త వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 57 ఏళ్లు నిండిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.
తెలంగాణలో కొత్త వృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన వారి నుంచి పింఛన్ల దరఖాస్తులు తీసుకోనున్నారు. సోమవారం నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. తెలంగాణలో 2019 జులై నుంచి కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ ఆగిపోయింది. టీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆసరా పింఛన్లు రూ. వెయ్యి, వికలాంగులకు ఇచ్చే పింఛన్లను రూ. 2 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తిరిగి రెండోసారి టీఆర్ఎస్ అధికారం చేపట్టాక ఆసరా పింఛన్ ను రూ.2016, వికలాంగుల పింఛను రూ.3016 లకు పెంచింది. కానీ వృద్ధాప్య పింఛన్ల అర్హతను వయసు మాత్రం 65 ఏళ్లుగా నిర్ణయించింది. దీంతో చాలా మందికి పింఛన్ వర్తించకుండా పోయింది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
వృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తుదారుల వార్షికాదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలు మించకూదని ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తుదారుల పేరిట మెట్ట భూమి 7.5 ఎకరాలు, మాగాణి 5 ఎకరాల లోపు ఉండాలి. కుటుంబంలో ఇప్పటికే ఎవరైనా పింఛను పొందుతుంటే మరొకరు దరఖాస్తుకు అనర్హులని తెలిపింది. అధికారులు వీటన్నింటినీ విచారణ చేసి అర్హులను గుర్తిస్తారు. అనంతరం పింఛను మంజూరవుతుంది. ఈ నెల 31కి 57 ఏళ్లు నిండిన వారంతా కొత్తగా వృద్ధాప్య పింఛను పొందేందుకు అర్హులుగా ప్రభుత్వం పరిగణిస్తుంది. అర్హులు దగ్గరలోని మీ-సేవ కేంద్రాలకు వెళ్లి ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల తమ వయసు నిర్థారణకు పంచాయతీ, మున్సిపల్ జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రాలు లేదా విద్యాసంస్థలు జారీ చేసిన సర్టిఫికేట్స్, ఓటరు గుర్తింపుకార్డులో నమోదైన వయసును ఆధారంగా చూపించవచ్చని ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డు, వయసు నిర్థారణ పత్రంతో పాటు బ్యాంకు పాసు పుస్తకం, పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో స్వయంగా దరఖాస్తుదారుడు మీ-సేవ కేంద్రానికి వెళ్లి వేలిముద్ర వేయాల్సిఉంటుంది.
Also Read: హైదరాబాద్ ఫార్మా కంపెనీలో రూ. 550 కోట్ల లెక్క చూపని ఆదాయం ! ఐటీ శాఖ కీలక ప్రకటన !
Also Read: వృద్ధాప్య పెన్షన్ వయసు పరిమితి తగ్గింపు.. ఇకనుంచి వీళ్లందరికీ ఆసరా పింఛన్లు