Telangana Govt Hospital: ప్రభుత్వాసుపత్రుల్లో నూతన వైద్య విధానం - ఓపీలకు నో చీటీ , ఓన్లీ ఆన్ లైన్ లోనే!
Telangana Govt Hospital: తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతన వైద్య విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఓపీ కోసం చీటీల తీసే పద్ధతిని పూర్తిగా ఆన్ లైన్ ద్వారానే నిర్వహించబోతున్నారు.
Telangana Govt Hospital: ప్రభుత్వాసుపత్రులు, ప్రైవేటు ఆస్పత్రులకు... ఇలా ఎక్కడికి ఓపీ కోసం వెళ్లినా చీటీలు తీయడం మనందరికీ తెలిసిందే. కానీ తెలంగాణ సర్కారు... ప్రభుత్వ ఆసుపత్రుల్లో చీటీలు తీసే విధానాన్ని రద్దు చేయబోతుంది. ఆన్ లైన్ ద్వారానే ఓపీ చీటీలు తీసుకొని సేవలను వినియోగించుకునే వీలు కల్పిస్తోంది. ఈ విధానాన్ని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో ఇప్పటికే అమల్లోకి తెచ్చింది. ఇతర ఆస్పత్రులకు కూడా ఈ విధానాన్ని విస్తరించనుంది. ఈ విధానంలో సర్కారు దవాఖానాల్లో రోగి వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసి ఆధార్ అనుసంధానం చేస్తారు. ఇలా వైద్యసేవలు అందిస్తున్నారు. ఎవరైనా ఏదో సమస్యతో ఆసుపత్రికి వెళ్లినప్పుడు కచ్చితంగా చీటీ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో సూచించిన మేరకు ఆరోగ్య సమస్యల ఆధారంగా ఆయా వైద్యుల వద్దకు వెళ్లి చూపించుకునే వాళ్లు. ఇవన్నీ మాన్యువల్ గానే జరిగేవి.
రోగి సమాచారమంతా ఆ చీటీలోనే..!
రోగికి సంబంధించిన వివరాలు, ఆరోగ్య సమస్యలు, సిఫార్సు చేసిన వైద్య పరీక్షలు, తర్వాత రావాల్సిన సమయం, వైద్యం, ఆరోగ్య సమాచారం అంతా ఆ కాగితాల్లోనే ఉండేది. ఆసుపత్రికి వచ్చిన ప్రతీ సారి దీన్ని తీసుకు వస్తే దాని ఆధారంగా వైద్యులు చికిత్స చేసేవారు. రికార్డు తీసుకురాకున్నా, మర్చిపోయినా, అది పోయినా మళ్లీ ఓపీ తీసుకొని వైద్య సేవలు పొందాల్సి ఉంటుంది. కానీ ఇకపై అలా చీటీలు పట్టుకు రావాల్సిన పని లేకుండా చేసింది సర్కారు. మొదటి సారి మనం ఆస్పత్రికి వెళ్లినప్పుడు వ్యక్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఈక్రమంలోనే రోగికి సంబంధించి ఒక సీఆర్ నంబర్ జనరేట్ అవుతుంది. ఆ వ్యక్తి ఎప్పుడు ఆసుపత్రికి వచ్చినా ఈ నంబర్ ద్వారానే వైద్య సేవలు అందుతాయి. రోగికి సంబంధించిన వివరాలన్నీ ఆన్ లైన్‌లో ఎప్పుడూ ఉంటాయి. ఆ వ్యక్తి తర్వాత ఆసుపత్రికి వస్తే ఆధార్ లేదా సీఆర్ నంబర్ నమోదు చేస్తే రోగికి సంబంధించిన పూర్తి రికార్డు వైద్యులకు అందుబాటులోకి వస్తుంది. దీంతో ఆ వ్యక్తి గతంలో ఎలాంటి సమస్యతో వచ్చారు, ఎవరు చికిత్స చేశారు, ఎలాంటి చికిత్స అందించారు వంటి వివరాలు అన్ని పూర్తిగా తెలుస్తాయి. దాన్ని బట్టి వాళ్లు వైద్యం చేయడానికి కూడా చాలా వీలు ఉంటుంది.
వేరే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా ఈ వివరాలన్నీ అందుబాటులో ఉండటం వల్ల చికిత్స చాలా సులువు అవుతుంది. రోగి వేలి ముద్రతో కూడా వివరాలు అందుబాటులోకి వచ్చేలా అధికారులు ఏర్పాటు చేశారు. రెండోసారి ఆసుపత్రికి వచ్చినపుడు ఆస్పత్రి సిబ్బంది... ఆధార్ సంఖ్య నమోదు చేసి ఆన్ లైన్ ఓపీ ఇస్తారు. ఈ - సుశ్రూత్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో వైద్య రికార్డులు అన్నీ అనుసంధానం చేయబడి ఉంటాయి. సర్కారు దవాఖానాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ల ద్వారా ఓపీ వివరాలు నమోదు చేస్తున్నారు.
ఆన్ లైన్ ఓపీ విధానం ద్వారా ఉపయోగాలేంటంటే..?
ఎప్పుడు ఆస్పత్రికి వెళ్లినా ఫైళ్లను తీసుకెళ్లే బాధ తప్పుతుంది. అది పోతుందేమో అనే టెన్షన్, పాడవుతుందనే బాధ లేకు పోతుంది. ముఖ్యంగా మాన్యువల్ రికార్డులతో అసలు పనే ఉండదు. ఎవరైనా రెండో సారి ఆస్పత్రికి వెళ్తే.. ఆలస్యం కాకుండా వెంటనే వైద్య సేవలు పొందవచ్చు. చికిత్స, వైద్యం, మందుల వివరాలను ఎప్పుడు కావాలన్నా పరిశీలించుకోవచ్చు. ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా ఈ రికార్డు అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి వివరాలు నమోదు చేసుకుంటే సరిపోతుంది. పదే పదే చేసుకోవాల్సిన పని లేదు. ‘ఈ-సుశ్రూత్’ యాప్‌లో వివరాలు ఉండటంతో.. ఏ ఆస్పత్రికి వెళ్లినా వైద్యులు చికిత్స అందిస్తారు. అయితే వైద్యులు ఎలాంటి చికిత్స అందిస్తున్నారునే దానిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇతర ఉన్నత వైద్యులు పర్యవేక్షించేందుకు అవకాశం కూడా ఉంటుంది.
మొదటి సారి వివరాల నమోదులో కాస్త జాప్యం
రాష్ట్రంలోని సర్కారు దవాఖానాల్లో ఓపీ విధానం అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ తెలిపారు. వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఇతర ఆస్పత్రుల్లో కూడా ఈ సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. దీని వల్ల మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలు ఉంటుందని.. మొదటి సారి రోగి తన వివరాలను నమోదు చేసుకునే సమయంలో కాస్త రద్దీ ఉన్నప్పటికీ.. ఆ తర్వాత జాప్యం లేకుండా చికిత్స పొందవచ్చని పేర్కొన్నారు. అలాగే ఈ రద్దీని తగ్గించేందుకు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టినట్లు స్పష్టం చేశారు.