Telangana Congress : దిల్లీ బండి ఎక్కుతున్న కాంగ్రెస్ నేతలు, వెంకటరెడ్డి ఏ గట్టునుంటారో?
Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్న నేతలు దిల్లీ బండి ఎక్కుతున్నారు. రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్ బాటలోనే వెంకటరెడ్డి కూడా నడుస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ కు షాక్ లు తగులుతున్నాయి. వరుసగా సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి దిల్లీ బండి ఎక్కారు. ఈ నేతలు ఇప్పటికే బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాజగోపాల్ రెడ్డి నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. బీజేపీలో చేరడంపై చర్చించినట్లు సమాచారం. మునుగోడులో బహిరంగ సభ నిర్వహించి పార్టీలో జాయిన్ అయ్యేందుకు రాజగోపాల్ రెడ్డి ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. అలాగే శనివారం దాసోజు శ్రవణ్ , బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ తో కలిసి దిల్లీ వెళ్లారు. దిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి పార్టీలో జాయిన్ అవ్వడంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
టార్గెట్ రేవంత్ రెడ్డి
అయితే కాంగ్రెస్ నుంచి బయటకు వస్తున్న నేతలు ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి కింద బానిసలా బతకలేమని ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయిస్తున్నారని విమర్శిస్తున్నారు. మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నిన్న కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ పెట్టి కార్యకర్తలతో సమావేశమయిన కీలక సమయంలో ఎంపీ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిల్లీలో అమిత్ షాతో భేటీ అవ్వడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో అండగా ఉండాల్సింది పోయి ఈడీ కేసులు పెట్టి వేధిస్తున్న బీజేపీ వాళ్లను కలవడం ఏంటని వెంకటరెడ్డిపై ఫైర్ అవుతున్నారు.
తమ్ముడు బాటలోనే వెంకటరెడ్డి?
శుక్రవారం చుండూరులో జరిగిన బహిరంగ సభ వేదికగా కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ గట్టునుంటారో తేల్చుకోవాలని సూచించారు. అయితే వెంకటరెడ్డి తాను పార్టీ మారడంలేదని స్పష్టం చేశారు. పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలపై సోనియా, రాహుల్ వద్దనే తేల్చుకుంటానని ప్రకటించారు. తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకుని, చెరుకు సుధాకర్‌ను పార్టీలో చేర్చుకున్న అంశంపై వెంకటరెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. చెరుకు సుధాకర్ తనకు వ్యతిరేకతంగా పనిచేశారని, అతన్ని పార్టీలోకి ఆహ్వానించడంపై అభ్యతరం వ్యక్తం చేశారు వెంకటరెడ్డి. ఇకపై రేవంత్ రెడ్డి ముఖం చూడనని ప్రకటించారు. వెంకటరెడ్డి కూడా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బాటలోనే వెళ్తారన్న ఊహాగానాలు వస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వెంకటరెడ్డి, తాజాగా అమిత్ షాతో భేటీ అవ్వడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. రేవంత్ రెడ్డితో పొసగకే కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
Also Read : Revanth Reddy : రాజగోపాల్ రెడ్డి చరిత్రహీనుడు, కాంట్రాక్ట్ ఒప్పందాల కోసమే బీజేపీలోకి - రేవంత్ రెడ్డి
Also Read : Dasoju Sravan : అంతా రేవంత్ రెడ్డే చేస్తున్నారు - కాంగ్రెస్‌కు దాసోజు శ్రవణ్ రాజీనామా!