CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: అల్లు అర్జున్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరోసారి స్పందించారు. రాజ్యాంగానికి అనుగుణంగానే చట్టం పని చేస్తుందని.. ఫిలిం స్టారా.? పొలిటికల్ స్టారా.? అని చూడమని చెప్పారు.
CM Revanth Reddy Responds On Allu Arjun Arrest Incident: ఓ సాధారణ పౌరుడి దగ్గరి నుంచి ప్రధాని వరకూ బాబా సాహెబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అందరికీ వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఓ జాతీయ మీడియా సదస్సులో మాట్లాడిన ఆయన.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై తాజాగా మరోసారి స్పందించారు. 'ఈ దేశంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్‌లు ఎందుకు అరెస్ట్ అయ్యారు. అంబేడ్కర్ రాజ్యాంగానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుంది. అల్లు అర్జున్‌ను అరెస్టు చేశామంటున్నారు. అక్కడ మహిళ చనిపోయింది, ఆమె కొడుకు ఇంకా జీవన్మరణ సమస్యతో బాధపడుతున్నాడు. దీనిపై మేము కేసు పెట్టకపోతే.. పెట్టలేదని మమ్మల్ని అడగరా.?. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా బెనిఫిట్ షోకు మాత్రమే అనుమతి ఇచ్చాం. ముందస్తు అనుమతి లేకుండా బన్నీ థియేటర్‌కు వచ్చారు.
ఆయన్ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై క్రిమినల్ కేసు బుక్ అయింది. పోలీసులు థియేటర్, మేనేజ్‌మెంట్ వాళ్లను అరెస్ట్ చేశారు. 10 రోజుల తర్వాత పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు కూడా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఫిలిం స్టార్లు, పొలిటికల్ స్టార్ల కోసం ప్రత్యేకంగా ఏముండదు. కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే ఎలాంటి సమస్య ఉండకపోయేది. కానీ కారులోంచి బయటికి వచ్చి చేతులూపి హడావిడి చేశారు. దీంతో జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు కంట్రోల్ కాలేదు. అందుకే అల్లు అర్జున్‌ను ఈ కేసులో A11గా పోలీసులు చేర్చారు.' అని సీఎం పేర్కొన్నారు.
'ఫిలిం స్టారా.? పొలిటికల్ స్టారా.? అని చూడం'
సినిమా నటుడిని కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందనే చర్చ మొదలు పెట్టారంటూ సీఎం రేవంత్ అన్నారు. 'నాకు చిన్నప్పటినుంచి అల్లు అర్జున్ తెలుసు, అతనికి నేను తెలుసు. అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ నేత. అల్లు అర్జున్ భార్య మాకు బంధువు. హోం శాఖ నా వద్ద ఉంది, ఈ కేసుకు సంబంధించిన రిపోర్ట్ నాకు తెలుసు. అతను సినిమా స్టారా.? పొలిటికల్ స్టారా.? అనే విషయాన్ని మా ప్రభుత్వం చూడదు. సినిమా నటులకు ఇదొక వ్యాపారం. డబ్బులు పెట్టారు. సినిమా తీశారు. సంపాదించుకున్నారు. నా ఫేవరేట్ హీరో కృష్ణ. నేనే ఒక స్టార్. నా కోసం ఫ్యాన్స్ ఉంటారు. నేను ఎవరికీ ఫ్యాన్ కాదు.' అని సీఎం స్పష్టం చేశారు.
కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు.