CM KCR: ముందస్తు ఎన్నికలకు నో ఛాన్స్... క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్... టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఇంకా చాలా పనులు చేయాల్సిఉందని, ముందస్తు ఎన్నికల వెళ్లే యోచనలేదన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ తెలంగాణ భవన్ లో శాసనసభ, పార్లమెంటరీ పక్షాల ఉమ్మడి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 10 లక్షల మందితో ఈ నెల 15న వరంగల్ ప్రజాగర్జన సభను నిర్వహించనున్నట్లు సీఎం పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు తథ్యమన్నారు. ప్రతి రోజు 20 నియోజక వర్గాల సన్నాహక సమావేశాలను నిర్వహించాలన్నారు. ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తుకు వెళ్లడం లేదని వెల్లడించారు.
27న భారీ సభ
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉందన్న సీఎం కేసీఆర్... ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు. మిగిలిన రెండేళ్లలో మరెన్నో అభివృద్ధి పనులు చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇంకా ఎక్కువ స్థానాలు గెలిచేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ నెల 27న హుజూరాబాద్‌లో భారీ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
హుజూరాబాద్ గెలుపుపై ధీమా
హుజూరాబాద్ ఉపఎన్నికపై టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో చర్చ జరిగింది. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ తప్పకుండా గెలుస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థగత నిర్మాణంపై నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రతి పక్షాలకు దిమ్మదిరిగేలా వరంగల్ ప్రజా గర్జన సభ ఉండాలన్నారు. అయితే తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారంపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని తేల్చిచెప్పారు.
Also Read: వామ్మో.. మందు బాబులూ.. దసరాకు ఇన్ని కోట్లు తాగారెంటయ్యా.. మద్యం ఏరులై పారిందిగా..
టార్గెట్ దిల్లీ
కేంద్ర రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలకం కానుందని సీఎం కేసీఆర్ అన్నారు. లోక్ సభలో మరిన్ని సీట్లు గెలిచి కీలకంగా మారాలన్నారు. లోక్ సభ స్థానాలపై దృష్టిపెట్టాలని శ్రేణులకు సూచించారు.
కేసీఆర్ పేరు ప్రతిపాదిస్తూ నామినేషన్
టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదల అయింది. ఆ పార్టీ నేత, ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఈ ఎన్నికల షెడ్యూల్‌ను ఆదివారం టీఆర్ఎస్ భవన్‌లో విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఆదివారం (అక్టోబరు 17) నుంచి ఈ నెల 22 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. శనివారం (ఈ నెల 23) ఉదయం 11 గంటలకు నామినేషన్లను పరిశీలిస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు తెలంగాణ భవన్‌లో నామినేషన్లను స్వీకరించనున్నట్లు చెప్పారు. 24న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని వెల్లడించారు. 25న హెచ్‌ఐసీసీలో జరిగే ప్లీనరీలో పార్టీలో అధ్యక్షుడిని ఎన్నికుంటారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ ఇవాళ తెలంగాణ భవన్‌లో పలువురు టీఆర్ఎస్ నేతలు నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read: టీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఎన్నికకు నోటిఫికేషన్.. కేసీఆర్ తరపున మంత్రుల నామినేషన్