CM KCR Review: తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు.. ఢిల్లీ నుంచి సమీక్షలో పైలంగా ఉండాలని చెప్పిన సీఎం కేసీఆర్
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి సమీక్ష చేశారు.
తెలంగాణలో వర్షాలపై సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి.. సమీక్ష చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. సీఎస్ సోమేశ్‌కుమార్, వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్షించారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. లోతట్టుప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు.
భారీ వానల వల్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాలు మండలాల్లోని ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయా శాఖల ఉద్యోగులను అప్రమత్తం చేయాలని సీఎం చెప్పారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానల వల్ల గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో ప్రభావితమయ్యే విద్యుత్తు, రోడ్లు,నాళాలు తదితర రంగాల పరిస్థితుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రోడ్లు భవనాల శాఖ, విద్యుత్ శాఖల అధికారులు కింది స్థాయి వరకు ఉద్యోగులను అప్రమత్తం చేయాలన్నారు.
భారీ ఎత్తున వరద పోటెత్తడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు, చెరువులు కుంటలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సీఎం అన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తం కావాలని సీఎం ఆదేశించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతూ వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టాలని సీఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో, ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ బలగాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకునేందుకు ప్రజా ప్రతినిధులు వారి వారి నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రభుత్వ యంత్రాంగం తో సమన్వయం చేసుకుంటూ తగు చర్యలు చేపట్టాలని కేసీఆర్ చెప్పారు.
తెలంగాణలో ఇప్పటికే వర్షాలు దంచి కొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో జలాయశయాలు, చెరువులు నిండుకుండల్లా మారడంతో పాటు నదులు, వాగులు, వంకలు ఉద్రుతంగా ప్రవహిస్తున్నాయి. మరో రెండురోజులు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాలో అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
Suryapet: సూర్యాపేట జడ్పీ సీఈవోపై సర్కార్ వేటు.. అలా మాట్లాడడమే కొంపముంచింది!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరకోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలలో కొనసాగుతోంది. రానున్న నాలుగురోజుల్లో ఇది పశ్చిమవాయవ్యంగా పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతోనే తెలంగాణతో పాటు కోస్తాంద్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలో అయితే అతిభారీ వర్షాలు కురుసే అవకాశం వుందని తెలిపింది.
తెలంగాణలో పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరించారు. ఆయా జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా వుండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తలరించాలని సూచించారు.