Minister Gummanuru Jayaram: అక్రమ ఇసుక రవాణా వివాదంలో ఏపీ మంత్రి... ఎస్సైతో మాట్లాడిన ఫోన్ కాల్ వైరల్...!
ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో ఏపీ మంత్రి ఎస్సైతో మాట్లాడిన ఫోన్ కాల్ వైరల్ అయ్యింది. దీనిపై మంత్రి స్పందించారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఏపీలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారం కలకలం రేపుతోంది. ఇసుక అక్రమ రవాణాలో వైసీపీ ప్రజాప్రతినిధుల హస్తముందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ తరుణంలో ఓ మంత్రి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను విడిచిపెట్టాలని ఎస్సైతో మాట్లాడిన ఫోన్ కాల్ వైరల్ అవుతోంది. ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అక్రమ ఇసుక రవాణా వివాదంలో చిక్కుకున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను విడిచిపెట్టాలన ఓ ఎస్సైని బెదిరించారన్న ఫోన్ కాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. వైసీపీ నేతల ఇసుక అక్రమ రవాణా నిజమేనని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
నేనే ధర్నాలో కూర్చుంటా...
మంత్రి గుమ్మనూరు జయరాం ఎస్సైతో మాట్లాడిన సంభాషణ..'నాలుగు ఖాళీ ట్రాక్టర్లు పట్టుకున్నారట. వదిలేయండి. లేదంటే అధికారంలో ఉన్న మంత్రిని నేనే ధర్నాకు కూర్చుంటాను. మంత్రి గింత్రని ఏ మాత్రం ఆలోచించను. నాకు నా జనాలు కావాలి. ఇక్కడ ఇంకోసారి పోటీ చేయాల్సింది నేను. ధర్నాకు నన్నే కూర్చునేలా చేస్తారో... లేక వదిలిపెడతారో చూసుకోండి'. మంత్రి గుమ్మనూరు జయరాం కర్నూలు జిల్లా ఆస్పరి ఎస్సైతో మాట్లాడిన ఫోన్ కాల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. కొన్ని రోజుల క్రితం ఆస్పరి పరిధిలోని యాటకల్లు గ్రామానికి చెందిన సుమారు 40 మంది ట్రాక్టర్ల యజమానులు, కార్యకర్తలు ఆలూరులో మంత్రి జయరాంను కలిశారు. పోలీసులు తమ ట్రాక్టర్లను పట్టుకున్నారని తెలిపారు. ఈ విషయంపై మంత్రి జయరాం ఆస్పరి ఎస్సైకు ఫోన్ చేశారు. మంత్రి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడారు. ఇది అక్కడున్న కొందరు చిత్రీకరించారు. ఫోన్ సంభాషణలో ఆదోని ట్రాక్టర్లు విచ్చలవిడిగా ఇసుక తోలుతున్నాయని, ఆస్పరి వాళ్లను ఎందుకు అడ్డుకుంటున్నారని ఎస్సైని మంత్రి ప్రశ్నించారు. ఇసుక ఉంటే విలేకరులెవ్వరూ చూడకపోతే వదిలిపెట్టండి, మన తాలూకాలో ఎక్కడా బతకలేని పరిస్థితి అంటూ మంత్రి ఫోన్ పెట్టేశారు.
Also Read: ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాల నోటిఫికేషన్ రద్దు... ఏపీ హైకోర్టు కీలక తీర్పు... ఈ ఏడాదికి పాత విధానమే...
అసత్య ప్రచారాలు
తన ఫోన్ కాల్ సంభాషణ వైరల్ అవ్వడంతో మంత్రి గుమ్మనూరు జయరాం స్పందించారు. బీసీ వర్గానికి చెందిన తనపై కొందరు కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఇసుక ట్రాక్టర్ల విషయంపై వాట్సాప్ ద్వారా ఒక ప్రకటన ఇచ్చారు. తాను ప్రాతినిథ్యం వహించే కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పరిధిలో ఎక్కడా ప్రభుత్వ గుర్తింపు పొందిన రీచ్‌లు లేనప్పుడు, ఇసుక అక్రమాలు ఎలా జరుగుతాయని మంత్రి ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లడంపై కార్యకర్తలు, గ్రామస్థులు తన దృష్టికి తీసుకువచ్చారని, ఆ విషయాన్నే తాను ఎస్సైతో మాట్లాడానని పేర్కొన్నారు.
Also Read: నూటొక్క జిల్లాల మాయగాడు.. విగ్గుతో యువతులకు గాలం... అబ్బో ఇంకా చాలా సిత్రాలు ఉన్నాయ్