Yadadri: యాదాద్రి పునఃప్రారంభం ముహూర్తం ఖరారు... కిలో 16 తులాల బంగారం ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటన
యాదాద్రి పునఃప్రారంభ తేదీని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ యాదాద్రి ఆలయం పునః ప్రారంభం ముహూర్తం ఖరారు అయ్యింది. మంగళవారం యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్ ముహూర్తం తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మహా కుంభ సంప్రోక్షణ కోసం వివిధ పీఠాలకు ఆహ్వానం పంపనున్నట్టు చెప్పారు. మహాకుంభ సంప్రోక్షణకు ఎనిమిది రోజుల ముందు మహా సుదర్శనయాగం ఉంటుందని పేర్కొన్నారు.
Also Read: టీఆర్ఎస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్
నాలుగేళ్ల క్రితమే ఆలోచన
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించిన అనంతరం యాదాద్రిలో సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురైందన్నారు. గతంలో తెలంగాణలో పుష్కరాలు కూడా నిర్వహించలేదు. ఉద్యమ సమయంలో గోదావరి పుష్కర శోభ ప్రపంచానికి తెలియజేశామని సీఎం కేసీఆర్ అన్నారు. జోగులాంబ అమ్మవారి శక్తిపీఠానికి ప్రాచుర్యం కల్పించామన్నారు. యాదాద్రి అభివృద్ధికి నాలుగైదేళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నామన్నారు. యాదాద్రి వైభవాన్ని నలుదిక్కులా చాటేందుకు ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టామన్నారు. చినజీయర్ స్వామి సూచనలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. చినజీయర్‌స్వామి సూచనలతో సిద్ధాంతులు, వాస్తు నిపుణులతో చర్చలు జరిపి ఆలయ పునర్నిర్మాణం చేశామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో టెంపుల్ సిటీ నిర్మాణం జరిగిందని సీఎం కేసీఆర్ వివరించారు.
125 కిలోల బంగారం
యాదాద్రి ఆలయం విమాన గోపురానికి తిరుమల తరహాలో బంగారు తాపడం చేయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీని కోసం 125 కిలోల బంగారం అవసరమవుతుందన్నారు. యాదాద్రికి తొలి విరాళంగా తమ కుటుంబం నుంచి కిలో 16 తులాల బంగారం ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. చినజీయర్‌స్వామి జీయర్ పీఠం నుంచి కిలో బంగారం ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. మంత్రి మల్లారెడ్డి కిలో బంగారం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కిలో బంగారం ఇస్తామన్నారని పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌రెడ్డి 2 కిలోల బంగారం, కావేరీ సీడ్స్ తరఫున భాస్కర్‌రావు కిలో బంగారం ఇస్తామన్నారని కేసీఆర్ అన్నారు. మంత్రి హరీష్ రావు కిలో బంగారం ఇస్తానని తెలిపారు.
Also Read: యాదాద్రి లక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్న కేసీఆర్.. ఆలయంలో పనులు పరిశీలన