TS Cabinet Decisions: వీళ్లందరికీ రూ.లక్ష సాయం, గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం - తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే
మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించి వివరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సమావేశం మూడు గంటల పాటు సాయంత్రం 6:15 గంటల వరకు సాగింది. దాదాపు మూడు గంటలకు పైగా మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించి వివరించారు.
కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారిని మరింత ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన కేబినెట్ కమిటీ ఏర్పాటు చేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి సభ్యులుగా ఉండనున్నారు. ఈ సబ్ కమిటీ విశ్వబ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులు, రజకులు, మేదరి, కుమ్మరి తదితర వృత్తి కులాల వారికి ప్రోత్సాహకాలు అందించేలా విధివిధానాలు ఖరారు చేయాలని కేబినెట్ సబ్ కమిటీకి సీఎం ఆదేశించారు. ఈ సబ్ కమిటీ విధివిధానాలు ఖరారు చేస్తే దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పథకం అమలు చేయాలని సీఎం ఆదేశించారు.
జీవో 111 రద్దు
111 జీవోను పూర్తిగా ఎత్తేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 84 గ్రామాల ప్రజలు అనేక రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. 111 జీవో వల్ల తమ గ్రామాలు డెవలప్‌మెంట్‌కు దూరంగా ఉన్నాయని గ్రామాల ప్రజలు అంటున్నందున జీవో 111 ను రద్దు చేశాం. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న భూములకు ఏ విధానాలు వర్తిస్తాయో, ఇప్పటిదాకా 111 జీవో పరిధిలో ఉన్న భూములకు కూడా అవే విధివిధానాలు వర్తిస్తాయి.
కాళేశ్వరం జలాలతో మూసీ, గండిపేట్ లింక్
రాబోయే రోజుల్లో కొడపోచమ్మ సాగర్ లో ఉన్న కాళేశ్వరం జలాలతో మూసీ, గండిపేట్, హిమాయత్ సాగర్ ను లింక్ చేయాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. స్వచ్ఛమైన మూసీగా మార్చడం సహా గండిపేట, హిమాయత్ సాగర్‌ను నిండు కుండలా మార్చాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాక, హుస్సేన్ సాగర్‌ను కూడా గోదావరి జలాలతో లింక్ చేయాలని, అందుకు డిజైన్లను రూపకల్పన చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
అన్ని జిల్లాలకూ డీఎం అండ్ హెచ్ఓ పోస్టులు మంజూరు
వైద్య రంగంలోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ 33 జిల్లాల్లోనూ డీఎం అండ్ హెచ్‌వో పోస్టులను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ జిల్లా అన్నిటికన్నా పెద్దగా ఉంటుంది కాబట్టి, ఇక్కడ ఆరు జోన్లను అనుగుణంగా ఆరు డీఎం అండ్ హెచ్ఓ పోస్టులను మంజూరు చేయనున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 38 మంది డీఎం అండ్ హెచ్ఓలు ఉండనున్నారు.
అర్బన్ హెల్త్ సెంటర్స్‌లో ఇక పర్మినెంట్ ఉద్యోగులు
కొత్తగా ఏర్పడ్డ 40 మండలాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులు పని చేస్తుండగా, వీటిలో పర్మినెంట్ ఉద్యోగులను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని కేబినెట్ నిర్ణయాలు ఇవీ..
* నకిలీ విత్తనాల మీద ఉక్కుపాదం మోపాలని కేబినెట్ నిర్ణయం
* ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే పీడి యాక్ట్ పెట్టాలని కేబినెట్ ఆదేశం
* మక్కలు, జొన్నలు కొనేందుకు నిర్ణయం
* ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కిమ్ పేజ్ 1, 2 కేబినెట్ నిర్ణయం
* VRA లను రేగులరైజ్ చేసేందుకు కేబినెట్ నిర్ణయం
* రెండో విడత గొర్రెల పంపిణీకి నిర్ణయం.
* వనపర్తి లో జర్నలిస్ట్ భవనానికి, ఖమ్మంలో 23 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం.
* మైనార్టీ కమిషన్ లో జైన్ కమ్యూనిటిని చేర్చాలని కేబినెట్ నిర్ణయం.
* TSPSC లో 10 పోస్టులను కొత్తగా భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయం