Breaking News Live: కుప్పం మున్సిపాలిటిలో ఉద్రిక్తత... 14వ వార్డు ఏకగ్రీవంపై రచ్చ
ఏపీ, తెలంగాణ సహా అంతర్జాతీయంగా నేడు జరిగే బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లా మారాయిగూడెం లింగం పల్లి బేస్ క్యాంప్‌లో కాల్పులు కలకలం రేపాయి. తోటి జవాన్లపై మరో జవాన్ విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు అక్కడిక్కడే మృతి చెందగా మరో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులని భద్రాచలం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాల్పులలో మృతి చెందిన వారు రాజమణి యాదవ్, ధాంజీ, రాజీవ్ మండల్ వీరిలో రాజీవ్ మండల్ వెస్ట్ బెంగాల్‌కు చెందినవాడు కాగా, మరో ఇద్దరు బీహార్‌కి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ఎందుకు జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: పన్ను కట్టేందుకు డబ్బు లేదు! షేర్లు అమ్మేసుకోనా అంటూ ట్విటర్లో మస్క్ పోల్
టీఆర్ఎస్ కార్పొరేటర్ కన్నుమూత
టీఆర్ఎస్ నాయకురాలు, జవహార్ నగర్ కార్పొరేటర్ విశ్రాంతమ్మ (55) మృతి చెందారు. గత 8 నెలలుగా ఆమె కేన్సర్‌తో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఆమె భర్త రాబర్ట్, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా నుంచి 35 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌కు వలస వచ్చి స్థిరపడ్డారు. వార్డు మెంబర్‌గా రాజకీయ ఆరంగ్రేటం చేసిన ఆమె.. గత ఎన్నికల్లో జవహర్‌నగర్ కార్పొరేషన్‌లో స్వంతంత్ర అభ్యర్థిగా గెలిచారు. తర్వాత మంత్రి మల్లారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి మల్లారెడ్డి, మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు తదితరులు విశ్రాంతమ్మ పార్థీవదేహానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు.
వ్యభిచార రాకెట్ గుట్టు రట్టు
హైదరాబాద్‌లోని బౌద్ధ నగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై ఆదివారం చిలకలగూడ పోలీసులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లికి చెందిన రేచల్ సోఫియా (50) అనే మహిళ నెల రోజుల క్రితం ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. పద్మారావునగర్ ఏషియన్ వైన్స్‌లో పనిచేసే అప్పల అనిల్ (22) సహకారంతో అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది. దీంతో ఆ గృహంపై దాడి చేసి పోలీసులు ఓ యువతికి విముక్తి కల్పించారు. ఓ విటుడిని కూడా అరెస్ట్ చేశారు.
Also Read: పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించకపోతే ప్రజలకే కాదు ప్రభుత్వానికీ నష్టమే..! ఎలాగో తెలుసా ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
హుజూరాబాద్ ఫలితాల పరిశీలకులుగా నంజన్యన్ మత్..
హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలపై అధ్యయన కమిటీ పరిశీలకుడిగా మాజీ ఎమ్మెల్యే, కర్ణాటక రాష్ట్ర సీనియర్ నాయకులు నంజన్యన్ మత్ ను ఏఐసీసీ నియమించింది. ఈ విషయాన్ని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నెల రోజులలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఏఐసీసీ ఆదేశించిందని ఆయన పేర్కొన్నారు.
ఈ నెల 10న వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటన
ఈనెల 10న ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటన చేయనున్నారు. వరంగల్-హనుమకొండ అభివృద్ధిపై సమీక్షించనున్నారు. వరంగల్ ఔటర్ రింగ్‌రోడ్ నిర్మాణం, జిల్లాలోని మున్సిపాలిటీల్లో రోడ్ల అభివృద్ధిపై ఆరా తీయనున్నారు. జంట నగరాల్లో రైల్వే ట్రాక్‌లపై ఆర్‌వోబీల నిర్మాణంపై సమీక్షించనున్నారు. వరంగల్ ఇంటర్నల్ రింగ్‌రోడ్ పూర్తికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు.
కుప్పం మున్సిపాలిటిలో ఉద్రిక్తత... 14వ వార్డు ఏకగ్రీవంపై రచ్చ
కుప్పం మున్సిపాలిటిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ కార్యాలయాన్ని తెలుగుదేశం నాయకులు ముట్టడించారు. 14వ వార్డు ఏకగ్రీవంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. 14 వార్డులో వైసీపీ అభ్యర్థిని ఏకపక్షంగా ఎలా ఏకగ్రీవం చేస్తారని టీడీపీ అధికారులని ప్రశ్నిస్తుంది. ఎలక్షన్ నిబంధనలను అతిక్రమించిన కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ బయటకు తీయాలని నిరసన తెలిపారు. వెంటనే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని తెలుగుదేశం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దరువు ఎల్లన్న కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్
తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా బండలింగంపల్లి గ్రామంలోని బీజేపీ రాష్ట్ర నాయకుడు దరువు ఎల్లన్నకు మాతృవియోగం కలిగింది. సోమవారం కరీంనగర్ ఎంపీ, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. దరువు ఎల్లన్నకి బండి సంజయ్ ధైర్యం చెప్పారు.
రేపు శ్రీకాకుళం, ఒడిశాలో సీఎం జగన్ పర్యటన
శ్రీకాకుళం, ఒడిశాలో మంగళవారం సీఎం జగన్ పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 01.15 గంటలకు పాతపట్నం చేరుకుంటారు. అక్కడ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. శ్రీకాకుళం పర్యటన ముగించుకుని విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు విశాఖ నుంచి భువనేశ్వర్ బయలుదేరనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నివాసంలో ఇరు రాష్ట్రాలకు చెందిన వివిధ పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. రాత్రి 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 9 గంటలకు తాడేపల్లికి చేరుకోనున్నారు.