Telangana ACB: లంచాల కలెక్షన్ కోసం వాట్సాప్ గ్రూప్.. ఏవో తెలివితేటలకు బిత్తరపోయిన ఏసీబీ అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో నార్లపాటి మహేష్ చందర్ ఛటర్జీ అనే వ్యక్తి 8 ఏళ్ల నుంచి మండల వ్యవసాయ అధికారి(ఏవో) గా పని చేస్తున్నారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
లంచాలకు అలవాటు పడ్డ అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏవో) ఒకరు అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన తాను తనిఖీలు చేయకుండా ఉండాలంటే లంచాలు ఇవ్వాలంటూ పలువురిని డిమాండ్ చేసినట్లుగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వెల్లడించారు. అయితే, ఆ బేరసారాలు, లంచానికి సంబంధించిన చర్చలు జరిపేందుకు సదరు వ్యవసాయ అధికారి ఏకంగా వాట్సప్ గ్రూపును కూడా నడుపుతున్నట్లు ఏసీబీ అధికారులు తెలుసుకొని విస్తుపోయారు. సాధారణంగా లంచం వంటి అక్రమ లావాదేవీలు జరిపేవాళ్లు వాటికి రుజువులు ఉండకూడదనే ఉద్దేశంతో చాలా రహస్యంగా నిర్వహిస్తుంటారు. కానీ, ఈ కేసులో ఆయన మాత్రం ఏకంగా వాట్సప్ గ్రూపునే నిర్వహిస్తుండడం విస్మయం గొలుపుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో నార్లపాటి మహేష్ చందర్ ఛటర్జీ అనే వ్యక్తి 8 ఏళ్ల నుంచి మండల వ్యవసాయ అధికారి(ఏవో) గా పని చేస్తున్నారు. సాధారణంగా మండలంలోని పురుగుమందులు, ఎరువుల షాపులను సక్రమంగా నిర్వహిస్తున్నారా? సరకు నాణ్యంగా ఉంటుందా? అనేది విషయాలను తనిఖీలు చేస్తుండాలి. కానీ, ఈయన అలా తనిఖీలు చేయకుండా ఉండేందుకు నెలవారీగా లంచం సొమ్ము తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మండలంలోని పురుగుమందులు, ఎరువుల షాపుల యజమానులను నెలనెలా డబ్బు పంపాలని డిమాండ్ చేసినట్లుగా అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు.
ఇందుకోసం ఆయన వాట్సప్ గ్రూపు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫలానా నెలలో ఆ దుకాణం వారు రూ.15 వేలు ఇవ్వాలంటూ గ్రూపులో మెసేజ్‌లు పంపాడు. ఈ విషయంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండలోని 6 దుకాణాల యజమానులు కొందరు గత నెలలో అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు. ముందుగా వేసిన ప్రణాళిక ప్రకారం.. ఆరు దుకాణాల యజమానులు లంచం ఇస్తామని చెప్పి ఏవో మహేష్ చందర్ రమ్మని కోరారు. వెంటనే వచ్చిన ఏవో వారి నుంచి రూ.90 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సరిగ్గా అదే సమయంలో అశ్వారావుపేటలోని ఆయన ఇంట్లో కూడా అవినీతి నిరోధక శాఖ సీఐ రఘుబాబు సోదాలు చేశారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని, చట్టప్రకారం అధికారిపై కేసు పెట్టి విచారణ జరుపుతున్నామని ఏసీబీ ఉన్నతాధికారులు వెల్లడించారు.
అయితే, వ్యవసాయాధికారి 8 సంవత్సరాలుగా అదే మండలంలో పని చేస్తున్నారు. దీంతో ఆయనే సొంతగా పట్టణంలో ఎరువుల షాపు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అధికారి అయి ఉండి నేరుగా ఆ వ్యాపారం చేస్తే ఇబ్బందులు వస్తాయని భావించి మరో ఇద్దరిని ఉంచి వ్యాపారం చేయిస్తున్నట్లుగా సమాచారం. ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే ఎరువులు, పురుగుమందులను ఇక్కడ విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లుగా తెలుస్తోంది. మిగిలిన వ్యాపారులకు ఇది నచ్చకపోవడంతో ఆయన లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టించినట్లుగా ప్రచారం జరుగుతోంది.