Revanth Reddy: కోర్టు పట్ల కనీస గౌరవం లేదా? సీఎం రేవంత్‌పై సుప్రీంకోర్టు సీరియస్
Telangana News: కల్వకుంట్ల కవిత జైలు నుంచి విడుదలపై రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును విమర్శించేలా మాట్లాడారు. దీంతో సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Supreme Court Serious on Revanth Reddy: దేశంలోనే అత్యున్నత న్యాయస్థానంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఒక రాజ్యాంగ కార్యకర్త అయి ఉండి ఆ విధంగా మాట్లాడుతున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఎవరేం విమర్శించినా పట్టించుకోబోమని, తాము మాత్రం తమ మనస్సాక్షి ప్రకారం విధులు నిర్వహిస్తామని ధర్మాసనం వెల్లడించింది. రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి తాము బెయిల్ ఇవ్వడం లేదా ఏవైనా ఉత్తర్వులు జారీ చేస్తున్నామా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పై జైలు నుంచి విడుదల కావడంపై స్పందించారు. ఈమెకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, కవిత విడుదలపై రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పును విమర్శించేలా మాట్లాడారు. దీంతో సుప్రీంకోర్టు గురువారం ఓటుకు నోటు కేసు పిటిషన్ విచారణ సందర్భంగా రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఆ పిటిషన్ దాఖలైంది. జస్టిస్ గవాయి దీనిపై స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి కవిత బెయిల్ విషయంలో చేసిన వ్యాఖ్యలను తప్పు బట్టారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి సుప్రీంకోర్టు పట్ల కనీస గౌరవంగా ఉండాలని సూచించారు.
ఇలాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి.. ఓటుకు నోటు కేసు బదిలీని పిటిషనర్ కోరినట్టు వేరే రాష్ట్రానికి బదిలీ చేయమంటారా అని జస్టిస్ గవాయి ప్రశ్నించారు. రేవంత్ తరపున అడ్వొకేట్లుగా ముకుల్ రోహత్గీ, సిద్దార్థ్ లూత్రా ఉండగా.. మరోసారి ఇలా జరగబోదని వారు సుప్రీంకోర్టు ధర్మాసనానికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఓటుకు నోటు కేసు పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడింది.