Sharmila : రూ. 10 కోట్ల పరిహారం ఇవ్వాలి.. సీఎం స్పందించాలి ! చిన్నారికి న్యాయం చేయాలని సింగరేణి కాలనీలో షర్మిల దీక్ష !
చిన్నారి హత్యాచార ఘటనలో రూ. 10కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల దీక్ష ప్రారంభించారు. పరామర్శకు వెళ్లి అక్కడే దీక్షకు కూర్చోవడంతో పోలీసుల్లో కలవరం ప్రారంభమయింది.
హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో జరిగిన చిన్నారిపై హత్యాచార ఘటన విషయంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల దీక్షకు కూర్చున్నారు. చిన్నారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆమె అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించలేదని.. బాధితులు ఎస్టీలు కావడం వల్లే స్పందించడం లేదా అని మండిపడ్డారు. తక్షణం ఈ ఘటనపై కేసీఆర్ స్పందించాలని .. ఆ చిన్నారి కుటుంబానికి నష్టపరిహారంగా రూ. పది కోట్లు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకూ తాను దీక్షను విరమించబోనని ప్రకటించారు. అక్కడే ఉంటానని తెలిపారు. తెలంగాణను మద్యం. డ్రగ్స్ అడ్డాగా మార్చారని.. ఘటనలో పోలీసుల వైఫల్యం ఉందని ఆరోపించారు.
Also Read : సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన చుట్టూ రాజకీయం! న్యాయం ఎలా చేస్తారు ?
షర్మిల ఒక్క సారిగా దీక్షకు కూర్చోవడంతో పోలీసులు ఉలిక్కి పడ్డారు. గత రెండు, మూడు రోజుల నుంచి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతల సింగరేణి కాలనీకి వస్తున్నారు. పరామర్శించి వెళ్తున్నారు. ఈ కారణంగా పోలీసులు కూడా ఎవరికీ అడ్డు చెప్పలేదు. షర్మిల కూడా అలాగే వెళ్లిపోతారని అనుకున్నారు. కానీ ఆమె దీక్ష ప్రారంభించారు. వైఎస్ఆర్ టీపీని ప్రారంభించి తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు రావాలని తన లక్ష్యాన్ని ప్రకటించినప్పటి నుండి రాజకీయ పోరాటాలకు షర్మిల దీక్షలనే ఎంచుకున్నారు. మొదటి సారిగా ఇందిపార్క్ వద్ద నిరుద్యోగ దీక్ష చేశారు. అక్కడ పోలీసులు అడ్డుకున్నారని తన ఇంట్లో దీక్ష చేశారు. ఆ తర్వాత ప్రతి మంగళవారం దీక్ష చేస్తున్నారు. ఇప్పుడు హఠాత్తుగా చిన్నారి హత్యాచార గఠన విషయలోనూ దీక్షకు దిగారు.
Also Read : చిన్నారి హత్యాచార ఘటనపై మహేష్ బాబు స్పందన
చిన్నారి హత్యాచార ఘటనలో రాజకీయాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తొమ్మిదో తేదీన పాప రాజు అనే కీచకుడి చేతిలో అత్యాచారం, హత్యకు గురైతే రెండు , మూడు రోజుల వరకూ ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం సింగరేణి కాలనీ రాజకీయ నాయకుల కేంద్రంగా మారిపోయింది. అన్ని పార్టీల నేతలు .. కొంత మంది సినిమా తారలు కూడా వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. నిందితుడ్ని ఇంత వరకూ పట్టుకోకపోవడంతో రాజకీయ నేతలకు కూడా పని దొరికినట్లయింది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ చిన్నారి కుటుంబానికి సంఘిభావం తెలియచేస్తున్నారు.
Also Read : సైదాబాద్‌లో చిన్నారిపై హత్యాచార నిందితుడిపై భారీ రివార్డ్.. పట్టిస్తే రూ.10 లక్షలు..
ఇప్పటి వరకూ పోలీసులు చిన్నారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చే వారిపై ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. ఇప్పుడు షర్మిల దీక్ష చేపట్టడంతో శాంతిభద్రతల సమస్యలు వస్తాయన్న కారణంగా ఆంక్షలు పెట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. ముందుగా షర్మిలను అక్కడ్నుంచి పంపించేయాలని భావిస్తున్నారు. ఆ తరవాత రాజకీయ నేతలు అటువైపు రాకుండా కట్టడి చేయాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Also Read : సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసు.. నిందితుడు ఎక్కడ.. సాయం చేసింది అతడి ఫ్రెండేనా?