Telangana Nirbhaya : సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన చుట్టూ రాజకీయం! న్యాయం ఎలా చేస్తారు ?
హైదరాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన చిన్నారి హత్యాచారం ఘటన రాజకీయ దుమారానికి కారణం అవుతోంది. ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బాధిత కుటుంబానికి పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణలో రాజకీయం అంతా చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన చుట్టూ తిరుగుతోంది. సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాపపై రాజు అనే దుండగుడు కిరాతానికి పాల్పడిన ఘటనపై రోజు రోజుకు రాజకీయ దుమారం పెరుగుతోంది. మంత్రి కేటీఆర్ నిందితుడ్ని అరెస్ట్ చేశామని ప్రకటించారు. కానీ అరెస్ట్ చేయలేదని తరవాత తెలిసిందని ఆయన ట్వీట్ సవరించుకున్నారు. ఇక ప్రభుత్వం నుంచి ఎవరూ ఆ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించలేదని ప్రభుత్వంలో అసలు బాధ్యత లేకుండా పోయిందని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పుడు ఆ చిన్నారి కుటుంబానికి పరామర్శల కోసం రాజకీయ నేతలు, కాస్త సామాజిక సమస్యలపై స్పందించే ఇతర ప్రముఖులు క్యూ కడుతున్నారు.
వినాయకచవితి రోజునే చిన్నారిపై ఆటోడ్రైవర్ అఘాయిత్యం !
హైదరాబాద్‌లో వినాయక చవితి వేడుకలు జరుగుతున్న సమయంలో సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాపను రాజు అనే ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడి చంపేశాడు. అంతకు ముందు రోజు అంటే సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం నుంచి పాప కనిపించడం లేదు. తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు. ఎంతకీ కనిపించలేదు. దీంతో వారి బస్తీలోనే ఉంటూ ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ ఏరియాలో జనాలతో దురుసుగా వ్యవహరిస్తూ ఉండే రాజుపై అనుమానం వచ్చింది. అర్థరాత్రి సమయంలో రాజు ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా ఆ చిన్నారి విగత జీవిగా పడి ఉంది. రాజు ఆ ఘటన తర్వాత కనిపించకుండా పోయాడు. ఈ ఘటనపై బస్తీ వాసులంతా ఆందోళనకు దిగారు.నిందితుడు రాజును తమకు అప్పగించే వరకూ పాప మృతదేహాన్ని అక్కడి నుంచి తీసేది లేదని బస్తీవాసులంతా నిరసనకు దిగారు. చివరికి పోలీసులు నచ్చ చెప్పి అంత్యక్రియలు చేయించారు. కానీ నిందితుడ్ని మాత్రం పట్టుకోలేదు. ఇప్పుడు పోలీసులు రూ. పది లక్షల రివార్డును ప్రకటించారు.
"6 సం' చిన్నారి అత్యాచారం, హత్య" కేసులో నిందితుడిని (దేశదిమ్మరి), పట్టుకొనడంలో, #తెలంగాణాపోలీసులకు సమాచారం అందించి సహకరించండి.
— Telangana State Police (@TelanganaCOPs) September 14, 2021
పట్టించిన వారికి రూ.10 లక్షల, నగదు బహుమతి ప్రకటించబడింది. pic.twitter.com/ElbG4d3fuT
Also Read : చిన్నారి హత్యాచార ఘటనపై మహేష్ బాబు స్పందన
నిందితుడ్ని అరెస్ట్ చేశామన్న కేటీఆర్ ట్వీట్‌తో దుమారం .. !
చిన్నారిపై అఘాయిత్యం ఘటన సంచలనం సృష్టించింది. ప్రభుత్వానికి అసలు పట్టింపు లేదని ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శలు వచ్చాయి. దీంతో మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. నిందితుడ్ని గంటల్లోనే అరెస్ట్ చేశామని ప్రకటించారు. కానీ ఆ ట్వీట్ చేసిన మూడు రోజుల తర్వాత మరోసారి ట్వీట్ ను సవరించుకున్నారు. అరెస్ట్ చేయలేదన్నారు. దీంతో ప్రభుత్వంపై మరింతగా విమర్శలు పెరుగుతున్నాయి. నిందితుడ్ని ఎన్‌కౌంటర్ చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వం కనీసం నిందితుడ్ని కూడా అరెస్ట్ చేయాలన్న విమర్శలు ప్రారంభమయ్యాయి. నిందితుడు రాజును పట్టిస్తే రూ. పది లక్షలు ఇస్తామని పోలీసులు బహిరంగ ప్రకటన చేశారు. అయితే మంత్రి మల్లారెడ్డి మాత్రం ఓపిక పట్టండి.. అతన్ని ఎన్ కౌంటర్ చేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నారని రేపోమాపో ఎన్ కౌంటర్ చేస్తారన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.
Would like to correct my tweet below. I was misinformed that he was arrested. Regret the erroneous statement
— KTR (@KTRTRS) September 14, 2021
The perpetrator is absconding & @hydcitypolice has launched a massive manhunt for him
Let’s all make our best efforts to ensure he’s nabbed & brought to justice quickly https://t.co/IVz9Ri7jzn
Also Read : సైదాబాద్‌లో చిన్నారిపై హత్యాచార నిందితుడిపై భారీ రివార్డ్.. పట్టిస్తే రూ.10 లక్షలు..
సోషల్ మీడియా యాక్టివిజంతో రాజకీయ అంశంగా మారిన వైనం !
వినాయక చవితి పండుగ రోజు హీరో సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం జరగడంతో ఎలక్ట్రానిక్ మీడియా అంతా ఆ నటుడి ఆరోగ్య పరిస్థితిపై కవరేజీకే పరిమితమయింది. రెండు రోజుల పాటు అదే నడిచింది. టీవీ చానళ్లలో ఎక్కడా ఆ చిన్నారి హత్యాచారం ఘటన వార్తలు బయటకు రాలేదు. దీంతో సోషల్ మీడియాలో ఒక్క సారిగా విమర్శలు ప్రారంభమయ్యాయి. మీడియా తీరును విమర్శించడమే కాదు సోషల్ మీడియాలో ఆ చిన్నారికి న్యాయం చేయాలన్న డిమాండ్లతో పోస్టులు వెల్లువెత్తాయి. అప్పట్నుంచి ఆ చిన్నారి కుటుంబానికి రాజకీయ పరామర్శలు ఎక్కువైపోయాయి. దారుణానికి బలైంది గిరిజన బాలిక కావడంతో పెద్ద ఎత్తున పరామర్శలకు రాజకీయ నాయకులు వస్తున్నారు. దాదాపుగా అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు పరామర్శించారు. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, సినీ నటుడు మంచు మనోజ్ చిన్నారి కుటుంబాన్ని పలకరించారు. ఆ రాజకీయ పరామర్శలు ఇంకా కొనసాగుతున్నాయి.
Days after the irresponsible minister KTR tweets the culprit is caught within hours in the case of 6 year old sexually molested & murdered,@hydcitypolice announces Rs10 lakh to whoever gives a clue on absconding accused.I wish CM took this case as seriously as Huzurabad election pic.twitter.com/oy1ClwV1fe
— Revanth Reddy (@revanth_anumula) September 14, 2021
Also Read : సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసు.. నిందితుడు ఎక్కడ.. సాయం చేసింది అతడి ఫ్రెండేనా?
ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందంటూ వెల్లువెత్తుతున్న విమర్శలు !
గతంలో తెలంగాణలో దిశ ఘటన జరిగినప్పుడు నిందితుల్ని ఎన్ కౌంటర్ చేశారు. దీనికి కారణం ఆ ఘటన జరిగినప్పుడు నిందితులు బతికి ఉండకూడదన్న ఆవేశం ప్రజల్లో కనిపించింది. వారి అభిప్రాయాలకు తగ్గట్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్న అభిప్రాయం ఏర్పడింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం నిందితుల్ని కట్టడి చేయడానికి ఏమీ చేయలేదన్న అభిప్రాయం ఉంది. అందుకే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు చేస్తున్నారు. సింగరేణి కాలనీ ఘటన జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం చాలా తేలిక తీసుకుందని వరుసగా జరిగిన ఘటనలను వివరిస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం తమను తాము సమర్థించుకోవడానికి ఇంకా ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు.
Also Read : వీళ్ల వేషాలు చూసి ఫ్లాటయితే బుక్కయినట్లే ! ఈ జంట ఎన్ని కోట్లకు జనాల్ని ముంచారో తెలుసా..?
బాధిత కుటుంబ ఐడెంటీటీని బయట పెట్టేస్తున్న పార్టీలు !
ఇటీవల ఢిల్లీ శివారులో ఇలాంటి దురాగతమే జరిగింది. అప్పుడు రాహుల్ గాంధీ సహా అనేక మంది వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే ఢిల్లీ పోలీసులు వారిని చాలా వరకు అడ్డుకున్నారు. అదే సమయంలో ఆ అత్యాచార ఘటనపై రాజకీయం చేస్తున్నారంటూ బీజేపీ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేసింది. అత్యాచార బాధితురాలి కుటుంబ ఐడెంటీటీని రాహుల్ గాంధీ బయట పెట్టారని ఇది పోక్సో చట్టంకింద నేరమని ఆరోపణలు చేశారు. వారి ఫోటోలను ట్వీట్ చేసినందుకు రాహుల్ ట్విట్టర్ అకౌంట్‌ను కొన్నాళ్లు సస్పెండ్ చేశారు. అయితే అలాంటి నిబంధనలేమీ తెలంగాణలో పెట్టలేదు. చిన్నారి కుటుంబం ఐడెంటిటీని అందరూ బయట పెట్టేస్తున్నారు. ఆ పాప తల్లిదండ్రులే ముందుకు వచ్చి తమ పాపకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : ప్రియుడి మోజులో పెంచిన తల్లి హత్య... కొబ్బరితాడుతో ఉరి వేసి...