Jaggareddy: సంగారెడ్డి ప్రజలపై అలిగిన జగ్గారెడ్డి - పోటీ చేయను..ప్రచారం చేయనని శపథం
Sangareddy: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి సంగారెడ్డి ప్రజలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఇక పోటీ చేయనని ..తన కుటుంబసభ్యులు పోటీ చేసినా ప్రచారం చేయబోనని శపథం చేశారు.

Sangareddy leader Jaggareddy : సంగారెడ్డి రాజకీయాల్లో సీనియర్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన ఆయన, ఇప్పుడు తన సొంత నియోజకవర్గ ప్రజలపైనే అలిగారు . తన ఓటమికి స్థానిక మేధావులే కారణమని, గత ఎన్నికల్లో తన కోసం సాక్షాత్తు రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా తనను ఓడించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. రాహుల్ గాంధీని పిలిచి తాను అవమానించానేమో అనే బాధలో ఉన్న జగ్గారెడ్డి, ఇక జీవితంలో సంగారెడ్డి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయనని ప్రకటించేశారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ ఓటమికి ప్రజలను లేదా మేధావులను బాధ్యులను చేస్తూ నియోజకవర్గానికి దూరం కావడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి. ఎన్నికల్లో తన భార్య నిర్మల పోటీ చేసినా, తాను మాత్రం ప్రచారంలో పాల్గొననని ఆయన ఖరాకండిగా చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా కాంగ్రెస్ తరపున తిరుగుతాను కానీ, సంగారెడ్డి గడ్డపై కాలు మోపి ఓట్లు అడగనని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తనను మూడుసార్లు గెలిపించిన ప్రజల పట్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు ఆయన అనుచరుల నుంచి వస్తున్నాయి.
జగ్గారెడ్డి లాంటి మాస్ లీడర్ ఒక నియోజకవర్గంపై ఇలా అలిగి కూర్చోవడం వల్ల నష్టం ఆయన వ్యక్తిగత ఇమేజ్‌కే కలిగే అవకాశం ఉంది. గతంలో కూడా అనేకసార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఆయన, ఇప్పుడు సెంటిమెంట్ రాజకీయాలను నమ్ముకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే, ప్రజలపై కోపం పెంచుకుని రాజకీయాల నుండి తప్పుకోవడం లేదా ప్రచారానికి దూరంగా ఉండటం వల్ల పార్టీకి కూడా ఇబ్బందులు తప్పవు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చెప్పినా తన నిర్ణయం మార్చుకోనని చెప్పడం ద్వారా ఆయన తన పట్టుదలను చాటుకుంటున్నారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవితంలో తాను సంగారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయనని అన్నారు. తన కోసం రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా ఓడించారన్నారు. రాహుల్‌ని పిలిచి అవమానించానేమో అని ఫీలయ్యారు.#jaggareddy #sangareddy… pic.twitter.com/dbj79w4lp0
— ABP Desam (@ABPDesam) January 17, 2026
ప్రజలే తీర్పు ఇచ్చే ప్రజాస్వామ్యంలో, వారిపైనే అలిగి రాజకీయాలు చేయడం అనేది ముందుకెళ్లే నాయకుడి లక్షణం కాదన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. తనను ఆదరించిన నియోజకవర్గానికి దూరమవ్వడం వల్ల తన ఉనికిని తానే ప్రమాదంలో పడేసుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోంది. జగ్గారెడ్డి ఈ పదేళ్ల విరామ ప్రకటనను పునరాలోచించుకుంటారా లేక తన భార్యను గెలిపించుకోవడానికైనా మళ్ళీ జనంలోకి వస్తారా అనేది వేచి చూడాలి.





















