Revanth Reddy: అప్పుడు పదివేలు కూడా ఇవ్వని కేసీఆర్.. ఇప్పుడు పది లక్షలు ఇస్తా అంటే నమ్ముతున్నారా?
దళిత, గిరిజన దండోరాతో కదంతొక్కిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ దత్తత గ్రామంలో దీక్ష మెుదలుపెట్టారు. దీక్షా వేదిక నుంచి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో రెండురోజుల దళిత, గిరిజన దీక్ష చేపట్టింది తెలంగాణ కాంగ్రెస్. ఈ దీక్షలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వస్తుందనే నిధుల వరద పారిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే 1200 కోట్లు విడుదల చేశారని.. ఎన్నికలొస్తేనే కేసీఆర్ నిధులు ఇస్తారని రేవంత్ మండిపడ్డారు. దళిత బంధు పథకం పేరు చెప్పి హుజూరాబాద్ దళిత సోదరులను మోసం చేసి నెగ్గాలని కేసీఆర్ చూస్తున్నారని.. దళిత బిడ్డలు గ్రహించాలని కోరారు.
మూడుచింతలపల్లి అభివృద్ధిపై తాను చెప్పిన మాటలు తప్పయితే ముక్కు నేలకు రాసి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. ఏడున్నర సంవత్సరాలుగా కేసీఆర్ చేపట్టిన పనుల వల్ల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆలోచించడానికే రెండు రోజుల దీక్ష చేపట్టినట్లు వివరించారు. కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామంలో దళితులు ఉన్నారని.. బలహీన వర్గాలు, చదువుకున్న పిల్లలు, మహిళలు ఉన్నారని రేవంత్ అన్నారు. అయితే అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ లక్ష్మాపూర్, కేశవాపూర్, మూడుచింతలపల్లి గ్రామాలను దత్తత తీసుకుని ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి ఎక్కడ జరిగిందని రేవంత్ ప్రశ్నించారు. ఆయన దత్తత తీసుకున్న తర్వాతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని పేర్కొన్నారు. 2015లో సీఎం దత్తత తీసుకున్న చిన్నముల్కనూర్ గ్రామంలో 150 కుటుంబాల ప్రజలు రోడ్ల మీద బతుకుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. లక్ష్మాపూర్ గ్రామంలో ప్రారంభించిన ధరణి వెబ్సైట్లోనే లక్ష్మాపూర్ లేదని విమర్శించారు.
Also Read: KTR on Huzurabad: హుజూరాబాద్ ఉపఎన్నిక తప్ప వేరే పనేం లేదా? మాకు లైట్ బ్రదర్
గతేడాది వర్షాలతో హైదరాబాద్‌లో పది లక్షల ఇళ్లు మునిగిపోతే 6 లక్షల కుటుంబాలకు పది వేల రూపాయల సాయం అందిస్తానని చెప్పారని రేవంత్ గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల పేరుతో రూ.10 వేలు ఇవ్వకుండా ఆపేశారని చెప్పారు. అక్కడ పదివేలు ఇవ్వలేని కేసీఆర్.. పది లక్షలు ఇస్తానంటే నమ్మి మోసపోవద్దని రేవంత్ అన్నారు. ఈరోజు రాష్ట్రంలోని 30 లక్షల దళిత, గిరిజన, ఆదివాసీ కుటుంబాల భవిష్యత్తు హుజూరాబాద్‌లోని 22 వేల దళిత కుటుంబాల చేతిలో ఉందని రేవంత్ వ్యాఖ్యాంచారు.
Also Read: KTR On Huzurabad: ఆ విషయం తప్ప వేరే పనేం లేదా? హుజూరాబాద్ మాకు లెక్కలోకే రాదు