(Source: ECI/ABP News/ABP Majha)
KTR On Huzurabad: ఆ విషయం తప్ప వేరే పనేం లేదా? హుజూరాబాద్ మాకు లెక్కలోకే రాదు
హుజూరాబాద్ ఉపఎన్నిక అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఆ ఎన్నిక తమకు చిన్న విషయమని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తరువాత ఎన్నో ఎన్నికలు, ఉప ఎన్నికలు ఎదుర్కొందని కేటీఆర్ అన్నారు. అందులో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒకటని స్పష్టం చేశారు. అంతేగాని వేరేం పని లేనట్టు హుజూరాబాద్ ఉపఎన్నిక గురించే ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటామా? అని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ వచ్చిన తరువాత కూర్చొని మాట్లాడతామని చెప్పారు.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని కేటీఆర్ అన్నారు. రెండున్నర గంటలు సాగిన ఈ సమావేశంలో అసలు హుజూరాబాద్ అనే మాటే రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. పని చేసే ప్రభుత్వానికి, పార్టీకి ప్రజల మద్దతు కచ్చితంగా ఉంటుందనే నమ్మకం తమకు ఉందని కేటీఆర్ చెప్పారు.
రెండు దశాబ్దాల చరిత్రలో టీఆర్ఎస్ ఎన్నో విజయాలు సాధించిందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్, వరంగల్ మినహా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాలను దసరా రోజు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఢిల్లీలో టీఆర్ఎస్ భవనానికి సెప్టెంబర్ 2న భూమి పూజ కేసీఆర్ చేస్తారని వెల్లడించారు. సెప్టెంబర్ 2న గ్రామ కమిటీల నిర్మాణం చేపడతామన్నారు. మండల, పట్టణ, వార్డు మున్సిపల్, జిల్లా కమిటీలు కూడా సెప్టెంబర్‌లోనే పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు కమిటీలు వేసే బాధ్యతలు అప్పగిస్తామన్నారు.
కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే...
- హుజూరాబాద్ ఉప ఎన్నికను మిగతా ఉపఎన్నికలను చూసినట్టుగానే చూస్తాం.
- కొంతమందికి ఉప ఎన్నిక అత్యంత ప్రాధాన్యత గలది కావొచ్చు.. మాకు మాత్రం చిన్నదే.
- కేసీఆర్ ది బలహీనమైన గుండె కాదు.. దైర్యంతో తెలంగాణ ఉద్యమం ప్రారంభించినట్టే దళిత బంధు పథకం తెచ్చారు.
- ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టు గా మొదలు పెట్టిన దళితబంధు పథకం అమల్లో లో పాల్గొనండి.
- హుజూరాబాద్ ఎన్నిక వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయేది లేదు.. కేంద్రంలో ప్రభుత్వం మారేది లేదు.
- దళితబంధు సక్సెస్ అయితే దేశం తెలంగాణను చూస్తది.
- ఈటలకు ముందు కూడా పాత కమలాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలంగా ఉంది.. ఈటల రాజేందర్ 2003లో టీ ఆర్ఎస్ లో చేరారు.. అప్పటికే అక్కడ స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది.
Also Read: Rahul Gandhi Press Meet: ఇది ప్రైవేటీకరణ కాదు.. దేశాన్ని అమ్మేయడం: రాహుల్ గాంధీ