Revanth Reddy: అతనికి చిప్ప కూడే గతి అయింది, బిడ్డా! నెత్తిపై కాలు పెట్టి తొక్కుతరు - రేవంత్ రెడ్డి
నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గం పరిధిలోని బిజినేపల్లిలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
పాలమూరులో 14కు 14 సీట్లు గెలిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరేసే బాధ్యత నాది అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గం పరిధిలోని బిజినేపల్లిలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
“పాలమూరులో 14కు 14 సీట్లు గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరేసే బాధ్యత నాది. పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా వారిని భుజాలపై మోసుకెళ్లి కుర్చీపై కూర్చోబెట్టే బాధ్యత నాది. అందరం నాయకులం కలిసికట్టుగా పని చేస్తాం. దళిత, గిరిజన, ఆదివాసీ, బడుగు బలహీనవర్గాలు కలిసికట్టుగా కాంగ్రెస్ ను గెలిపించాలి” అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
‘‘కాంగ్రెస్ పార్టీ దళితులకు, గిరిజనులకు ఎన్నో పదవులు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు, సీఎల్పీ లీడర్ గా భట్టి విక్రమార్కకు, కేంద్రమంత్రిగా బలరాం నాయక్ కు, పంజాబ్ ముఖ్యమంత్రిగా దళితులకు అవకాశమిచ్చింది. తెలంగాణ, పాలమూరు గడ్డ ఇంకా దొరలు దళిత గిరిజనులపై కాలుపెట్టి తొక్కి ఆధిపత్యం చెలాయించాలని చూశారు. భూస్వాములు, దొరలు దళితులపై దాడులు చేస్తుంటే వారిని దిగంతాలను తరిమిన చరిత్ర ఈ గడ్డది. అనాడు నిజాం రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర ఈ పాలమూరు జిల్లాకు, నల్లమల్ల ప్రాంతానికి ఉంది. పాలమూరు గడ్డ అంటేనే పేదోల అడ్డ. అటువంటి గడ్డ మీద పేదోల మీద దాడి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ కూర్చోదు. 2018 ఎన్నికల్లో కేసీఆర్ 8 వేల ఎకరాలకు సాగు నీరందించే మార్కండేయ ప్రాజెక్టును కట్టిస్తా అని మాటచ్చిండు. 2019లో శిలాఫకం వేశారు. ఇంతవరకు అక్కడ తట్టెడు మట్టి మీద కూడా తీయలేదు. నాలుగేళ్లయినా ఇక్కడ కడతామన్న ప్రాజెక్టు అడుగు ముందుకు పడలేదు. మాట తప్పి ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ అన్యాయాన్ని ప్రశ్నించడానికి నాగం జనార్దన్ రెడ్డి అక్కడికి వెళ్లారు.
ఆ సమయంలో దళితులు, గిరిజనలు అండగా నిలబడ్డారు. ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళితే నాగం జనార్దన్ రెడ్డిపై కేసులు పెట్టారు. హామీలు నిలబెట్టుకోని ఈ ప్రభుత్వాన్ని నిలదీసేందుకే నాగం జనార్దన్ రెడ్డి అక్కడికి వెళ్లారు. ఒక వేళ మీకు చేతనైతే ప్రాజెక్టు కట్టండి లేకుంటే మేము సన్నాసులం అని ఒప్పుకోండి. చంద్రబాబు హయాంలో పాలమూరు నుంచి 10 లక్షల మంది వలస వెళ్లారు. వలసలను నివారించడానికి పాలమూరును పచ్చగా చేయడానికి రూ. 2వేల కోట్లతో 3.60 లక్షల ఎకరాలకు నీరు అందించే కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని నాగం జనార్ధన్ రెడ్డి మంజూరు చేయించారు. తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దాని సామర్థ్యాన్ని 5 లక్షల ఎకరాలకు పెంచింది. అనాడు పాలమూరు రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును మంజూరు చేసింది. మీ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును ఎండబెట్టింది. జూరాల, బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మేం కట్టిన ప్రాజెక్టుల దగ్గర ఇక్కడ ఎమ్మెల్యే ఫోటోలు దిగుతున్నాడు. లాల్చి వేసి ప్రతొక్కడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు. పంచెలు కట్టిన ప్రతీవాడు వైఎస్ రాజశేఖరరెడ్డి కాడు. ప్రాజెక్టుల విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్ధం. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి.. దరిద్రుడు సీఎం అయిండు. దళితులకు మూడెకరాల భూమి, ఎస్సీ వర్గీకరణ, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని చెప్పిన సీఎం .. ఏమీ చేయలేదు. పైగా దళిత గిరిజనుల గొంతుపై కాలు పెట్టి తొక్కిస్తున్నాడు. ఇదేనా నీ జాతి నీ నీతి.
నడి నెత్తిపై కాలు పెట్టి తొక్కి పాతాళంలోకి పంపిస్తారు - రేవంత్
మేమిచ్చిన తెలంగాణలో దళిత గిరిజనులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకొం. ఎన్నికలొస్తున్నాయ్ బిడ్డా.. నీ నడి నెత్తిపై కాలు పెట్టి తొక్కి జనం నిన్ను పాతాళంలోకి పంపిస్తారు. గతంలో నాగం జనార్దన్ రెడ్డి సంగతి చూస్తానన్న గాలి జనార్ధన్ రెడ్డికి చిప్ప కూడే గతి అయింది. ఇప్పుడు ఇక్కడున్న ఈ తిర్రి జనార్దన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే. శిశుపాలుడికి పట్టిన గతే ఈ తిర్రికి పడుతుంది. రాష్ట్రంలో దళిత గిరిజనులను బీఆరెస్ నేతలు అవమానిస్తున్నారు. దళిత గిరిజనులకు కాంగ్రెస్ అండగా నిలబడుతుంది. దొరలకు బీఆరెస్, పెట్టుబడిదారులకు బీజేపీ ఉంది. కానీ దళిత గిరిజనులకు కాంగ్రెస్ ఉంది. ఈ పార్టీ మీది.. ఈ జెండా మీది.. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది.
ప్రవీణ్ కుమార్, అకూనూరి మురళి, కృష్ణ ప్రసాద్, ప్రదీప్ చంద్ర వంటి అధికారులను అవమానించారు. మాదిగలకు మంత్రివర్గంలో స్థానంలో లేదు. మంద కృష్ణ మాదిగను జైలులో పెట్టిండు కేసీఆర్. పాలమూరులో 14కు 14 సీట్లు గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరేసే బాధ్యత నాది. పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా వారిని భుజాలపై మోసుకెళ్లి కుర్చీపై కూర్చోబెట్టే బాధ్యత నాది. దళిత, గిరిజన, ఆదివాసీ, బడుగు బలహీనవర్గాలు కలిసికట్టుగా కాంగ్రెస్ ను గెలిపించాల’’ని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.