![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Revanth Reddy: నేషనల్ హైవేలు, ఆర్ఆర్ఆర్‌పై రేవంత్ కీలక సమీక్ష - కలెక్టర్లకు ఆదేశాలు
RRR Latest News: భూ సేకరణలో అధికారులు మానవీయ కోణంతో వ్యవహరించాలని రేవంత్ రెడ్డి సూచిచారు. రైతులతో కలెక్టర్లు నేరుగా మాట్లాడాలని.. ఆర్ఆర్ఆర్ అంతటికీ ఒకే నెంబర్ ఉండాలని అన్నారు.
![Revanth Reddy: నేషనల్ హైవేలు, ఆర్ఆర్ఆర్‌పై రేవంత్ కీలక సమీక్ష - కలెక్టర్లకు ఆదేశాలు Revanth Reddy orders collectors to act like humanitarian manner while land acquisition for RRR Revanth Reddy: నేషనల్ హైవేలు, ఆర్ఆర్ఆర్‌పై రేవంత్ కీలక సమీక్ష - కలెక్టర్లకు ఆదేశాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/10/ca93ec1611660695e4f81b275be773771720615348412234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
National Highways Review Meeting: జాతీయ రహదారులకు భూ సేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. నిబంధనల ప్రకారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత రైతులకు దక్కేలా చూడాలన్నారు. తెలంగాణలో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ఏఐ) పరిధిలో రహదారుల నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలపై డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా భూ సేకరణ ఎందుకు ఆలస్యమవుతోందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
రైతులకు అన్యాయం జరగొద్దు
భూములకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువ ఉండడం, మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండడంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదని కలెక్టర్లు తెలిపారు. స్పందించిన ముఖ్యమంత్రి తరతరాలుగా వస్తున్న భూములను రైతులు శాశ్వతంగా కోల్పోతున్నారనే విషయాన్ని గుర్తించాలన్నారు. కలెక్టర్లు రైతులతో పిలిచి మాట్లాడి వారిని ఒప్పించాలని సూచించారు. రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం, ఉత్తర భాగం వేర్వేరుగా చూడొద్దని, ఆ రెండింటికి కలిపి ఒకే నెంబర్ కేటాయించాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరగా, ఆయన సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఆ ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఎన్ హెచ్ఏఐ మధ్య త్రైపాక్షిక ఒప్పందం (ట్రైపార్టియేట్ అగ్రిమెంట్) కుదుర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. వెంటనే దానిని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో భూ సేకరణలో ఉన్న ఆటంకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అలైన్ మెంట్ విషయంలో పొరపడి కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారని, దాంతో హైకోర్టు స్టే ఇచ్చిందని యాదాద్రి భువనగిరి కలెక్టర్ హన్మంత్ కె.జెండగే తెలిపారు. స్టే తొలగింపునకు వచ్చే శుక్రవారం నాటికి కౌంటర్ దాఖలు చేయాలని కలెక్టర్ కు ముఖ్యమంత్రి సూచించారు. నాగ్ పూర్-విజయవాడ కారిడార్ లో ఖమ్మం జిల్లాలో భూ సేకరణ పరిస్థితి ఏమిటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఖమ్మం సమీపంలోని విలువైన భూముల గుండా రహదారి పోతుందని, పరిహారం విషయంలో రైతులను ఒప్పిస్తున్నామని ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తల్లాడ-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ రహదారి పనులు సాగుతున్నందున, ప్రస్తుతం ఖమ్మం నుంచి అశ్వారావుపేట వరకు ఉన్న జాతీయ రహదారిని రాష్ట్ర రహదారిగా మార్చుకోవాలని ఎన్ హెచ్ఏఐ అధికారులు సూచిస్తున్నారని, దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని, జాతీయ రహదారిగానే దానిని కొనసాగించాలని మంత్రి తుమ్మల అభిప్రాయం వ్యక్తం చేశారు.
రెండు నెలల్లో హైదరాబాద్-విజయవాడ విస్తరణ పనులు
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ఆరు వరుసల విస్తరణ పనులకు భూ సేకరణ పూర్తయినందున వెంటనే పనులు చేపట్టాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్ హెచ్ఏఐ ప్రాజెక్టు మెంబర్ అనిల్ చౌదరిని కోరారు. రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని ఆయన బదులిచ్చారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి ఓఎస్డీలు శేషాద్రి, మాణిక్ రాజ్, చంద్రశేఖర్ రెడ్డి, షానవాజ్ ఖాసిం, మౌలిక వసతుల సలహాదారు శ్రీనివాసరాజు, ఎన్ హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి రజాక్, పీసీసీఎఫ్ డోబ్రియల్, ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, జాయింట్ సెక్రటరీ హరీష్, మెదక్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)