Revant Reddy : సెప్టెంబర్ 17న మేనిఫెస్టో - ఖచ్చితంగా ధరణి రద్దు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
సెప్టెంబర్ 17వ తేదీన మేనిఫెస్టో విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Revant Reddy : కర్ణాటక తరహాలో ముందే మేనిఫెస్టో విడుదల చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే యూత్, రైతు, నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించింది. త్వరలో మరిన్ని డిక్లరేషన్స్ ప్రకటించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవం అయిన సెప్టెంబర్ 17వ తేదీన మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్మయించారు. హైదరాబాద్‌లో యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో రేవంత్ మాట్లాడారు. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం మీరంతా కష్టపడాలి. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.
పార్టీ, ప్రజల కోసం పోరాడేవారికి నాయకుడిగా భవిష్యత్
పార్టీ, ప్రజల కోసం పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందని నాయకుడిగా మారేందుకు యూత్ కాంగ్రెస్ ఓ వేదిక అని చెప్పారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేనే దీనికి ఉదాహరణ అని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించినలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. వన్ నేషన్ వన్ పార్టీ అనేది బీజేపీ రహస్య అజెండా. బీజేపీ కుట్రలను ఛేదించి రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాల్సి ఉందన్నారు. 2004 నుంచి 2014 వరకు జరిగిన అభివృద్ధి, 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్‌కు రేవంత్ సవాల్ చేసారు. ' 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్నారు.
కేటీఆర్, హరీశ్ చర్చకు సిద్ధమా?' అని రేవంత్ ప్రశ్నించారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓ అవకాశం ఇవ్వాలి !
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరుతున్నారు. అగ్రనాయకులు అందుబాటులో ఉండే అవకాశాన్ని బట్టి బహిరంగ సభలు ఉంటాయి. కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలి. దీనికి అవసరమైన కార్యాచరణపై యూత్ కాంగ్రెస్‌కు దిశా నిర్దేశం చేశామన్నారు. మేనిఫెస్టో ఆలస్యం చేయడం వల్లే గతంలో ఇబ్బంది పడినట్లు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రెండు లక్షల రుణమాఫీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, పంటకు మద్దతు ధరతో పాటు బోనస్, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, రైతుబందు సహాయం పెంపు, చదువుకునే అమ్మాయిలకి ఎలక్రికల్ బైక్స్, నిరుద్యోగ భృతి మొదలగు అంశాలు పొందపరచనున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి రద్దు
గడీల పాలన పునరుద్ధరించేందుకే కేసీఆర్ ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారని రేవంత్ విమర్శించారు. కొద్ది మంది భూస్వాముల కోసమే ధరణి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్‌ను కచ్చితంగా రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కాజిగిరి భూముల్లో అవకతవకలు జరిగాయి. వేల ఎకరాల భూమిని కేసీఆర్.. బినామీలకు కట్టబెట్టారు. ప్రభుత్వ అధికారుల దగ్గర ఉండాల్సిన సమాచారం దళారుల చేతికి వెళ్లిపోయింది. ధరణి రాకముందు రైతు బంధు రాలేదా అని ప్రశ్నించారు.