Rains In AP and Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలతో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ
AP Rains | బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దాంతో పలుజిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు.

Telangana Rains | హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనితో పాటు, ఆగ్నేయ బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న రుతుపవన ద్రోణి ప్రభావం కూడా భారీ వర్షాలకు కారణమవుతోంది.
భారీ వర్షాలకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
ముఖ్యంగా నేడు (మంగళవారం), బుధవారం రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
As expected, HEAVY DOWNPOURS lashed various parts of North Telangana mainly Adilabad, Asifabad, Nirmal, Mancherial, Jagitial with few parts getting 100mm rainfall ⚠️🌧️
— Telangana Weatherman (@balaji25_t) September 2, 2025
The earlier shared Aug 31 - Sep 1 forecast map is completed
Will share Sep 2-4 rain forecast soon, updating… pic.twitter.com/iYVIkf6xRd
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..
ఇక ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు. వరద నీటిని దాటే ప్రయత్నాలు చేయకూడదని అధికారులు సూచించారు. వర్షం కురిసే సమయంలో పాత భవనాలు, చెట్ల కిందకు వెళ్లి తలదాచుకోవడం లాంటివి చేయకూడదని హెచ్చరించారు.
ఏపీలో 2 రోజులపాటు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
విశాఖపట్నం: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మంగళవారం, బుధవారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడుతుందని, దాని ప్రభావం ఏపీపై ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఈ క్రమంలో విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మంగళవారం ఈ జిల్లాలతో పాటు పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, డా బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
బుధవారం నాడు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో శుక్రవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదు అని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ఇక సోమవారం విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా విజయనగరం జిల్లా గుర్ల మండలంలో 76.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఆగస్టులో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు
IMD తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు నెలలో రాష్ట్రవ్యాప్తంగా సగటున 200.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణంగా ఉండే 144.3 మిల్లీమీటర్లతో పోలిస్తే 39 శాతం అధికం అని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీసత్యసాయి (143 శాతం), చిత్తూరు (123 శాతం), అనకాపల్లి (112 శాతం), అనంతపురం (110 శాతం), విశాఖపట్నం (100 శాతం) జిల్లాల్లో ఆగస్ట్ నెలలో అధిక వర్షపాతం నమోదైంది.
ట్రెండింగ్ వార్తలు






















