Free Bus Scheme In AP: మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్, ఇకనుంచి ఆ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం
మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇకనుంచి గ్రౌండ్ బుకింగ్ ఉన్న స్త్రీ శక్తి పథకం అమలయ్యే బస్సుల్లోనూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు.

అమరావతి: స్త్రీ శక్తి పథకం అమలులో భాగంగా కూటమి ప్రభుత్వం మరో వెసలుబాటు కల్పించింది. స్త్రీ శక్తి స్కీమ్ అమలు చేస్తున్న 5 రకాల బస్సుల్లో గ్రౌండ్ బుకింగ్ ఉన్నవాటిలో సైతం మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశాన్ని కల్పించారు. ఈ మేరకు గ్రౌండ్ బుకింగ్ ఉన్న ఆ ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కండక్టర్లు లేకుండా రెండు, మూడు బస్టాండ్లలో మాత్రమే ఆగేలా ఏపీఎస్ ఆర్టీసీ కొన్ని బస్సులను నడుపుతుందని తెలిసిందే. అలాంటి సర్వీస్ బస్సులకు ఆయా బస్టాండ్లలో మాత్రమే టికెట్లు జారీ (Ground Booking Ticket) చేస్తారు. స్త్రీ శక్తి పథకం అమలవుతున్న పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఇకనుంచి మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ప్రభుత్వం సూచించిన మరికొందరు ఉచితంగా ప్రయాణించవచ్చు.
ఏపీ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న సూపర్ సిక్స్ లో భాగంగా మహిళల కోసం స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించింది. సింహాచలంలో కొండపైకి వెళ్లే సిటీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత బస్సు అందించే స్త్రీశక్తి పథకం అమలు చేస్తున్నారు. ఈ బస్సులకు ఘాట్ రోడ్ టోల్ ఫీజు వసూలు నుంచి మినహాయించాలని సింహాచలం దేవస్థానం ఈవోకి ఆర్టీసీ అధికారులు లేఖ రాశారు. తిరుమల ఘాట్ కాకుండా ఏపీ వ్యాప్తంగా 39 ఘాట్ రోడ్లపై బస్సులు వెళ్తుంటాయి. తిరుమల కాకుండా మిగతా అన్ని ఘాట్ రోడ్లలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చారు.






















