PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ
పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రాంత గొప్పతనాన్ని గుర్తు చేశారు. భాజపా హయాంలో తెలంగాణ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని అన్నారు.
తెలంగాణ అభివృద్ధే భాజపా తొలి ప్రాధాన్యత
పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ప్రధాని మోదీ తెలంగాణ ప్రాంత చరిత్రను కొనియాడారు. తెలంగాణ ప్రజలు ప్రపంచమంతా ఉన్నారని దేశ అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నారని అభినందించారు. తెలంగాణ ప్రాచీనతకు, పరాక్రమానికి పుణ్యస్థలమని వ్యాఖ్యానించారు. భద్రాచలం లోని శ్రీరాముడి నుంచి యాదాద్రి నరసింహ స్వామి వరకూ, ఆలంపూర్ జోగులాంబ నుంచి వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి వరకూ అందరి ఆశీర్వాదం భారత్‌పైన ఉందని అన్నారు. రామప్ప ఆలయం, కాకతీయ తోరణం తెలంగాణ శిల్ప కళానైపుణ్యానికి నిదర్శనమని, ఇది మనకెంతో గౌరవం తెచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రతాప రుద్రుడు, రాణి రుద్రమ దేవి, కొమురం భీమ్ శౌర్యానికి తెలంగాణ ప్రతీక అని కొనియాడారు. ఇలాంటి చరిత్ర ఉన్న తెలంగాణ అభివృద్ధే భాజపా తొలి ప్రాధాన్యత అని చెప్పారు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ లో భాగంగా తెలంగాణఅభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్నామని అన్నారు.
తెలంగాణలోని గ్రామగ్రామాన భాజపా అభివృద్ధి ఫలాలు
2019 ఎన్నికల్లో భాజపాకు ఎంతో మద్దతునిచ్చారని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపాపై ఉన్న ప్రేమ ఏమిటో చూపించారని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న ప్రతి చోట ప్రజల విశ్వాసం పెరుగుతోందని చెప్పారు. అదే విశ్వాసం తెలంగాణ ప్రజల్లోనూ కనిపిస్తోందని వెల్లడించారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని, ప్రజలకే తమకు దారి వేస్తున్నారని వ్యాఖ్యానించారు. మహిళల ఉన్నతికి, ఆరోగ్యానికి తమ సర్కార్ తొలి ప్రాధాన్యతనిచ్చిందని స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్ అభియాన్ వల్ల తెలంగాణలోని మహిళలకు గౌరవప్రదమైన జీవితం లభించింది. ఉజ్వల యోజనతో తెలంగాణలోని లక్షలాది మంది మహిళలు పొగ నుంచి విముక్తి లభించిందని చెప్పారు. గర్భం దాల్చిన సమయం నుంచి ప్రసవం వరకూ ఎన్నో పథకాలు అమలు చేశామని, వాటి ఫలాలు తెలంగాణలోని గ్రామగ్రామాల్లోనూ కనిపిస్తున్నాయని వెల్లడించారు. ఈ పథకాల కారణంగానే మహిళల ఆరోగ్యం మెరుగైందని, వారి జీవితాల్లోనూ మార్పు వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు.
మహిళల పురోగతికి ప్రాధాన్యతనిచ్చాం..
భారత్‌లో తొలిసారి పురుషులకు సమానంగా మహిళల సంఖ్య పెరిగిందని చెప్పారు. బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యే మొత్తంలో మహిళల వాటా గణనీయంగా పెరిగిందని అన్నారు. తమ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాల వల్లే ఇదంతా సాధ్యమైందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.తెలంగాణలో కోటి జన్‌ధన్ ఖాతాలు ఉన్నాయని, వీటిలో 55%కి పైగా ఖాతాలు మహిళలవే అని వివరించారు. ముద్ర రుణాలు కూడా మహిళల జీవితాల్లో మార్పు తెస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో తయారైన వ్యాక్సిన్ కారణంగానే కోట్లాది మంది ప్రజల ప్రాణాలు కాపాడగలిగామని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం సృష్టించిన ఇకో సిస్టమ్ ద్వారా తెలంగాణలోని యువతీ, యువకులకు లబ్ధి జరుగుతోందని ప్రధాని మోదీ చెప్పారు. తెలుగులోనే ఇంజరీనింగ్, మెడిసిన్ చదువుకునే వెసులుబాటు రావటం వల్ల పిల్లల విషయంలో ఎంతో మంది తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేరుతాయని అన్నారు. ఆత్మనిర్భర భారత్‌కు అవసరమైన టాలెంట్ పూల్ పెరగటంలోనూ ఈ నిర్ణయం తోడ్పడుతుందని స్పష్టం చేశారు. ఆత్మనిర్భరతలో భాగంగా రామగుండం ఎరువుల ప్లాంట్‌నూ శక్తిమంతం చేస్తున్నామని చెప్పారు. కొన్ని సంవత్సరాల ముందు దేశంలో ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయని, వాటిలో రామగుండం ఫ్యాక్టరీ కూడా ఒకటని గుర్తు చేశారు. 2015లో ఈ ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభించామని వెల్లడించారు. ప్రస్తుతానికి రామగుండం ఫ్యాక్టరీలో ఫర్టిలైజర్ ఉత్పత్తి మొదలైందని, ఇక్కడి నుంచే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసే స్థాయికి ఎదుగుతుందని అన్నారు.
రూ.లక్ష కోట్ల విలువైన ధాన్యాలు కొనుగోలు చేశాం..
ఆరేళ్లలో కేంద్రం తెలంగాణ రైతుల నుంచి రూ.లక్ష కోట్ల విలువైన ధాన్యాలు కొనుగోలు చేసినట్టు వివరించారు. ఆ రైతులందరికీ డబ్బులు అందాయని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరనూ పెంచి రైతులకు తోడ్పడుతున్నట్టు చెప్పారు. తెలంగాణలో నగరాలను, గ్రామాలను మెరుగైన రహదారులతో అనుసంధానిస్తున్నట్టు చెప్పారు. ట్రాఫిక్ జామ్‌ను నిలువరించేందుకు రీజినల్ రింగ్ రోడ్‌ను నిర్మిస్తున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు. ఈ ఎనిమిదేళ్లలో జాతీయ రహదారుల కనెక్టివిటీ ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రస్తుతానికి తెలంగాణ మొత్తంగా 5 వేల కిలోమీటర్ల నేషనల్ హైవే నెట్‌వర్క్ ఉందని స్పష్టం చేశారు. ఇందుకోసం రూ.2,700కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. గ్రామాల్లోనూ నేషనల్ హైవేకు అనుసంధానించే మార్గాలు నిర్మిస్తున్నట్టు చెప్పారు. పీఎం గ్రామీణ్ సడక్ యోజనతో ఈ కొత్త రహదారుల నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. టెక్స్‌టైల్ రంగంలో భారత్ అగ్రగామిగా ఉండాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఏడు టెక్స్‌టైల్ పార్క్‌లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. వీటి వల్ల రైతులకు లాభం చేకూరటమే కాకుండా, నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. తెలంగాణలోనూ ఓ మెగా టెక్స్‌టైల్ పార్క్ నిర్మించనుందని ప్రధాని మోదీవివరించారు. తెలంగాణ రైతులకు, యువతకు ఈ పార్క్ వల్ల లబ్ధి చేకూరుతుందని చెప్పారు. తెలంగాణలోనూ భాజపా డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వస్తే, ఈ అభివృద్ధి మరింత జోరందుకుంటుందని హామీ ఇచ్చారు. అరగంట సేపు సాగిన ప్రసంగంలో ఎక్కడా కేసీఆర్ పేరు కానీ, తెరాస పార్టీ గురించి కానీ ప్రస్తావించలేదు.